రాహుల్ వైపు మ‌ళ్లిన డగ్స్ వ్య‌వ‌హారం..గ‌జ్వేల్‌, నిర్మ‌ల్ స‌భ‌ల‌పై కేటీఆర్ సెటైర్లు

  • Written By:
  • Publish Date - September 18, 2021 / 02:18 PM IST

ఎక్కి పెళ్లి సుబ్బి చావుకి వ‌చ్చిన‌ట్టు..కేటీఆర్ మీద రేవంత్ చేసిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం రాహుల్ గాంధీ వైపు మ‌ళ్లింది. ఏ ప‌రీక్ష‌కైనా సిద్ధ‌మంటూనే..త‌న‌తో పాటు రాహుల్ కూడా న‌మూనాల‌ను ఇవ్వాల‌ని స‌వాల్ విస‌ర‌డం కొత్త వివాదానికి కేటీఆర్ తెర‌లేపాడు. గ‌జ్వేల్ స‌భ‌లో తాగుబోతుల‌కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయితే డ్ర‌గ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ రేవంత్ రెచ్చిపోయాడు. అందుకు ప్ర‌తిగా కేటీఆర్ చేసిన స‌వాల్ ఢిల్లీ వైపు మ‌ళ్లింది. శ‌శిథ‌రూర్ పై వ్యాఖ్య‌ల మాదిరిగా ఈసారి డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు రేవంత్ కు చేటు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.
కేటీఆర్ త‌న‌దైన శైలిలో విప‌క్ష పార్టీల చీఫ్ లపై వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. అమిత్ షాతో పాటు రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్, ష‌ర్మిల‌, ఆర్ ప్రవీణ్ కుమార్ పై విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ గ‌జ్వేల్‌, బీజేపీ నిర్మ‌ల స‌భ‌ల గురించి మాట్లాడారు. విలేక‌‌రుల‌తో చిట్ చాట్ చేసిన ఆయ‌న తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై తీవ్రంగా స్పందించారు. రేవంత్ పెట్టిన గ‌జ్వేల్ స‌భ కంటే వంటేరు ప్ర‌తాప్ రెడ్డి గ‌తంలో గొప్ప స‌భ‌ను నిర్వ‌హించార‌ని గుర్తు చేశారు. ఇక నిర్మ‌ల్ కు వ‌చ్చిన అమిత్ షా రాష్ట్రానికి ఏమి ఇచ్చారో చెప్ప‌కుండా వెళ్లార‌ని విమ‌ర్శించారు. సిల్లీ పాలిటిక్స్ చేయ‌డానికి ఢిల్లీ నుంచి వ‌చ్చార‌ని షాపై మండిప‌డ్డారు.

గోడ‌ల‌కు పెయింటింగ్‌, సున్నాలు వేసుకునే వ్య‌క్తికి జూబ్లీహిల్స్ లో నాలుగు ఇళ్లు ఎలా వ‌చ్చాయ‌ని రేవంత్ ను ప‌రోక్షంగా ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ లో రియ‌లెస్టేట్ భూమ్ వ‌చ్చింద‌ని, 50కోట్ల‌కు పీసీసీని ఠాకూర్ వ‌ద్ద కొనుగోలు చేసిన వ్య‌క్తి భ‌విష్య‌త్ లో కాంగ్రెస్ పార్టీని అమ్మ‌డం ఖాయ‌మ‌ని ఆరోపించారు. అంద‌రి జాత‌కాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని అవాకులు, చెవాకులు పేలిగే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. గుడ్డ‌లూడ‌దీసి రోడ్డు మీద నిల‌బెడ‌తామ‌ని రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
కొత్తగా పార్టీలు పెట్టిన ష‌ర్మిల‌, ప్ర‌వీణ్ కుమార్ రాబోయే రోజుల్లో టీఆర్ ఎస్ ఓట్ల‌ను చీల్చ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ‌కు అన్యాయం చేసిన కాంగ్రెస్, బీజేపీల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌డంలేద‌ని అన్నారు. బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌ను లైట్ గా తీసుకున్న కేటీఆర్ ఆయ‌న మీదా సెటైర్లు వేశారు. ఓట్లు వేసిన వాళ్లు ఎందుకు వేశామా అని బాధ ప‌డుతున్న విష‌యాన్ని సంజ‌య్ గుర్తించుకోవాల‌ని చుర‌క‌లంటించారు. కేసీఆర్ ప్ర‌భుత్వంపై గ‌జ్వేల్ స‌భ‌లో చార్జిషీట్ విడుద‌ల అంశంపై కేటీఆర్ స్పందించారు. క్రిమిన‌ల్స్ కు మాత్ర‌మే చార్జిషీట్ లు విడుద‌ల చేస్తార‌ని మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేపై సెటైర్ వేశారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావ‌ని ఎద్దేవా చేశారు. ఈటెల రాజేంద్ర ఓట‌మి ఖాయ‌మ‌ని, జానా కంటే ఈటెల పెద్ద లీడ‌ర్ కాద‌న్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు.
సింగ‌రేణి కాల‌నీలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యాన్ని కేటీఆర్ షేర్ చేసుకున్నారు. త‌న‌కూ ఒక కుమార్తె ఉంద‌ని సింగ‌రేణి కాల‌నీలోని సంఘ‌ట‌న క‌లిచివేసింద‌ని అన్నారు. మ‌హారాష్ట్ర త‌ర‌హా విధానాన్ని నేరాల నియంత్ర‌ణ‌కు తీసుకొస్తామ‌ని చెప్పారు. దిశ చ‌ట్టానికి మ‌రింత ప‌దును పెడ‌తామ‌ని అన్నారు. అడ్ర‌స్ లేని వాళ్లు కూడా కేసీఆర్ ని నోటికొచ్చిన‌ట్టు తిడుతున్నార‌ని, ఇక నుంచి వాళ్ల‌ను వ‌దిలిపెట్ట‌మ‌ని హెచ్చ‌రించారు. రాజ‌ద్రోహం కేసులు ఇక నుంచి పెడ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. డ్ర‌గ్స్ కేసులో తాను ఉన్నాన‌ని చెబుతున్న వాళ్ల‌కు స‌వాల్ చేస్తున్నా అంటూ కేటీఆర్ మండిప‌డ్డారు. న‌మూనాల‌ను ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. ఏ ప‌రీక్ష కైనా సిద్ధ‌మంటూనే రాహుల్ గాంధీ కూడా నమూనాల‌ను ఇవ్వ‌డానికి సిద్ధ ప‌డాల‌ని కేటీఆర్ స‌వాల్ విసిరారు. మొత్తం మీద విప‌క్ష నేత‌ల‌కు సెటైర్లు, చుర‌క‌ల‌తో గ‌జ్వేల్, నిర్మ‌ల్ స‌భ‌ల‌ను కేటీఆర్ లైట్ గా తీసుకున్నాడు.