CM KCR : త్రిశంకు స్వ‌ర్గంలో కేసీఆర్ `జాతీయ పార్టీ`!

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు, బీజేపీ జాతీయ వ‌ర్గ స‌మావేశాలు హైద‌రాబాద్ లో పెట్ట‌డం కేసీఆర్ జాతీయ పార్టీ మీద పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం పోల‌రైజేష‌న్ జ‌రుగుతోంద‌ని తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 08:00 AM IST

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు, బీజేపీ జాతీయ వ‌ర్గ స‌మావేశాలు హైద‌రాబాద్ లో పెట్ట‌డం కేసీఆర్ జాతీయ పార్టీ మీద పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం పోల‌రైజేష‌న్ జ‌రుగుతోంద‌ని తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. అందుకు నిద‌ర్శ‌నంగా ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల‌ను చూపుతున్నారు. ఇటీవ‌ల ఆ రెండు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి చెందిన ద్వితీయ‌శ్రేణి కాంగ్రెస్ లోకి వెళ్లింది. వాళ్ల ను లీడ్ చేస్తోన్న లీడ‌ర్లు కూడా త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డానికి సిద్థంగా ఉన్నారు. ప్ర‌స్తుతానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ద్వ‌యం వేసిన వ్యూహాల కార‌ణంగా ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ నూత‌నోత్సాహంతో ఉంది.

రాబోవు రోజుల్లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల‌పై `రెడ్డి` ద్వ‌యం వ్యూహాల‌కు ప‌దును పెట్ట‌నుంది. జిల్లాల వారీగా చేరిక‌ల‌కు ద్వారాల‌ను కాంగ్రెస్ పార్టీ బార్లా తెర‌చింది. దీంతో పూర్వ‌పు టీడీపీ లీడ‌ర్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పంచ‌న చేరుతున్నారు. గ‌తంలో టీడీపీని ఏ విధంగా కేసీఆర్ దెబ్బ తీశారో, అదే పంథాను రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో 80శాతం మంది పూర్వ‌పు టీడీపీ లీడ‌ర్లే ఉన్నారు. వాళ్లంద‌రూ రేవంత్ రెడ్డి సుప‌రిచితులు. ప్ర‌స్తుతం కేసీఆర్ మీద అసంతృప్తిగా ఉన్నారు. ఇంకో వైపు ఉద్య‌మ‌కారుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని టీఆర్ఎస్ పై ఆగ్ర‌హంగా ఉన్నారు. వాళ్ల‌ను కూడా చేర‌దీసుకునే ప్ర‌య‌త్నం క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతోంది. అమెరికా వెళ్లొచ్చిన త‌రువాత రేవంత్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి దూకుడును గ‌మ‌నించిన కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే అవ‌కాశంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

ఇక బీజేపీ కొంత కాలంగా దూకుడుగా వెళుతోంది. క్షేత్ర‌స్థాయిలో క్యాడ‌ర్ బ‌లంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు మైండ్ గేమ్ ఆడుతోంది. కేవ‌లం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే అసెంబ్లీలో ఉన్న బీజేపీ రాబోవు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం అనే దిశ‌గా మైండ్ సెట్ చేస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి వాదుల‌పై క‌న్నేసింది. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని చాలా కాలంగా ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ముగిసిన త‌రువాత ఒక పెద్ద ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌నుంద‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. రెండు రోజుల పాటు హైద‌రాబాద్ లోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షా మ‌కాం వేయ‌నున్నారు. మోడీ, షా ద్వ‌యం ఎక్క‌డ‌కు వెళ్లిన‌ప్ప‌టికీ అక్క‌డ విజ‌యాన్ని ముద్దాడుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు తెలంగాణ మీద వాళ్లిద్ద‌రూ ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ పెట్టారు. రాజ్యాధికారాన్ని తెలంగాణ‌లో అందుకోవ‌డానికి అనువైన ప‌రిస్థితుల‌ను ఇప్ప‌టికే అధ్య‌య‌నం చేసిన వాళ్లు, రాబోవు రోజుల్లో ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు.

ఒక వైపు కాంగ్రెస్ దూకుడు మ‌రోవైపు బీజేపీ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్న విష‌యాన్ని గ్ర‌హించిన కేసీఆర్ రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే దిశ‌గా ఆలోచ‌న‌లో ప‌డ్డారట‌. అందుకే, జాతీయ పార్టీ ఆవిర్భావం ప్ర‌స్తుతానికి అట‌కెక్కిన‌ట్టేన‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్, తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల వినికిడి. అయితే, కొత్త జాతీయ స్థాయి రాజకీయ పార్టీ దిశ‌గా భావ సారూప్య‌త ఉన్న రాజ‌కీయ పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూనే తెలంగాణలోని అంత‌ర్గ‌త ప‌రిస్థితిని నిశితంగా విశ్లేషిస్తున్నారని కొందరు చెబుతున్నారు. కేసీఆర్ తరచూ పార్టీ నేతలతో సంభాషిస్తున్నారని, కొన్ని సర్వే ఏజెన్సీలను కూడా నియమించుకున్నారని, రాజకీయ వ్యూహకర్త పీకేతో సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్‌కు వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ఎంత ముఖ్యమో జాతీయ పార్టీని ప్రారంభించడం అంత ముఖ్యమని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, తెలంగాణ‌లోనే రాజ‌కీయంగా వెనుక‌బ‌డిన విష‌యాన్ని గ్ర‌హించిన ఆయ‌న జాతీయ స్థాయికి వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌డ‌ని అంత‌రంగీకుల అభిప్రాయం.

గత రెండు ఎన్నికల మాదిరిగా భిన్నంగా ఒకవైపు అధికార వ్యతిరేక అంశం పెరుగుతుండడం మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు దూకుడుగా ఉన్నాయి. దీనికి తోడు కొన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. పరిస్థితి ఇలా ఉండగా, రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. జులై ద్వితీయార్థంలో కేసీఆర్ జాతీయ పార్టీని ప్రారంభించవచ్చని తొలుత భావించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు రావ‌డం కార‌ణంగా జాతీయ పార్టీకి స్వ‌స్తి ప‌లుకుతార‌ని మ‌రో టాక్‌. మరోవైపు అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెడతామని కేంద్రప్రభుత్వం ప్రకటించడం, దానిని ఎన్నికల అంశంగా మార్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్న తీరు కూడా టీఆర్‌ఎస్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో జాతీయ పార్టీ పెట్టే యోచ‌న‌కు స్వస్తి చెప్పాల‌ని కేసీఆర్ భావించే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ నేత‌లు కొంద‌రు చెబుతున్నారు. మొత్తం మీద త్రిశంకు స్వ‌ర్గంలో కేసీఆర్ జాతీయ పార్టీ ఉంద‌ని తెలుస్తోంది.