KCR Vs Congress : కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కాంగ్రెస్ ఎంతో మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణ బాధను పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే దళారుల రాజ్యం వస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత వరకు సెక్యులర్‌గానే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఉంటే.. మరింతగా అభివృద్ధిచెంది ఉండేవాళ్లమని కేసీఆర్ అన్నారు. ‘‘2004లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణ ఇవ్వలేదు. కానీ 2009లో తెలంగాణ ఉద్యమం తీవ్రతరం కావడంతో.. ఐదేళ్ల తర్వాత చాలా ఆలస్యంగా తెలంగాణను ప్రకటించారు’’ అని చెప్పారు. జుక్కల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్ ఈ కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘మీ పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో రైతుల పరిస్థితి చూస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. కానీ మనం తెలంగాణలో ఇస్తున్నాం’’ అని ఆయన వివరించారు. మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు.గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం దళిత బంధుతో దళితులకు అండగా నిలబడిందని చెప్పారు. లంబాడీలను, ఆదివాసీలను గౌరవించేందుకు తండాలను గ్రామపంచాయతీలుగా చేశామన్నారు. ‘‘తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంతో రాష్ట్రం అభివృద్ధి చెందిందా? లేదా? అనేది చూడొచ్చు. పదేళ్ల క్రితమే పుట్టిన మన తెలంగాణ ఈవిషయాల్లో దేశంలోని ఎన్నో రాష్ట్రాలను దాటి ముందుంది. దేశంలోనే తలసరి ఆదాయంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం’’ అని కేసీఆర్ (KCR Vs Congress) తెలిపారు.