కేసీఆర్ కు రిట‌ర్న్ గిఫ్ట్ దిశ‌గా టీడీపీ

తెలంగాణ‌లోనూ స‌త్తా చాట‌డానికి తెలుగుదేశం పార్టీ సిద్దం అవుతోంది.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 08:00 AM IST

తెలంగాణ‌లోనూ స‌త్తా చాట‌డానికి తెలుగుదేశం పార్టీ సిద్దం అవుతోంది. మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ నోళ్ల‌ను మూయించిన ఖ‌మ్మం జిల్లాలో పూర్వ వైభ‌వం కోసం టీడీపీ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నం చేస్తోంది. రాబోయే ఎన్నిక‌ల్లో పూర్వంలా తెలంగాణ వాప్తంగా స‌త్తా చాటాల‌ని ముందుకు క‌దులుతోంది. చంద్ర‌బాబు ఆనాడు చేసిన మేలును తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాల‌న చూసిన త‌రువాత ఆనాడు చంద్ర‌బాబు వేసిన పునాదుల‌పై న‌డుస్తుంద‌ని ఇప్పుడిప్పుడే బోధ‌ప‌డుతోంది. అందుకే, చంద్ర‌బాబు ఈసారి తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌డానికి సిద్ధం అవుతున్నార‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల‌, బీఎస్పీ తెలంగాణ చీఫ్ డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ చురుగ్గా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌ల బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న 7200 ఉద్య‌మం చేయ‌డానికి సిద్దం అయ్యారు. ఆయ‌న‌కు గ‌తంలోనే టీడీపీ నుంచి ఆహ్వానం ఉంది. మ‌రోసారి మ‌ల్లన్న వైపు టీడీపీ అధిష్టానం చూసే ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో 2019 మాదిరిగా పొత్తు దిశ‌గా కూడా ఆలోచిస్తోందని టాక్‌. అదే జ‌రిగితే, మ‌ల్ల‌న్న‌, రేవంత్ ఒకే వేదిక‌పై క‌నిపించ‌నున్నారు. టీడీపీ తెలంగాణ చీఫ్ గా మ‌ల్ల‌న్న‌, కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఒక చోట‌కు వ‌స్తే కేసీఆర్ స‌ర్కార్ ను ప‌డ‌గొట్టొచ్చ‌ని టీడీపీ అధిష్టానం అంచ‌నా వేస్తోంది.

తెలుగుదేశం పార్టీకి ఖ‌మ్మం, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, న‌ల్గొండ‌, నిజామాబాద్ , ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఓటు బ్యాంకు బ‌లంగా ఉంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టేందుకు ఇప్ప‌టి నుంచే సిద్ధం అవుతోంది. నిశ్శ‌బ్ద విప్లవం మాదిరిగా అనూహ్యంగా స‌భ్య‌త్వాల‌ను చేయించింది. అందుకు త‌గ్గ‌ట్లుగా భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లను ర‌చిస్తోంది. ఖ‌మ్మంలో భారీ బ‌హిరంగ‌స‌భ త‌రువాత తెలంగాణ టీడీపీ హ‌వా మ‌ళ్లీ క‌నిపించ‌నుంది. ఖ‌మ్మంలో భారీ బ‌హిరంగ స‌భ ద్వారా స‌త్తా చాటాల‌ని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌చ్చేలా ఇప్ప‌టికే సంకేతాలు వెళ్లాయి.

తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించబోతున్నారు. ఎన్టీఆర్ శత‌జ‌యంతి ఉత్స‌వాల‌ను వేదిక‌గా ఉప‌యోగించుకుని తెలంగాణ టీడీపీ వైభ‌వానికి నాంది ప‌ల‌కాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక్క బ‌హిరంగ‌స‌భే కాకుండా తెలంగ‌ణ వ్యాప్తంగా అనేక కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. టీడీపీ చీఫ్‌ బ‌క్క‌ని న‌ర్సింహులు, రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అర‌వింద్‌కుమార్‌గౌడ్‌, న‌ర్సిరెడ్డి, జ‌క్క‌లి ఐల‌య్య యాద‌వ్ త‌దిత‌రులతో కూడిన టీమ్ త్వ‌ర‌లోనే తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించాల‌ని స్కెచ్ వేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ దూకుడును గ‌మ‌నించిన టీఆర్ఎస్ పార్టీ ముంద‌స్తుగా అప్ర‌మ‌త్తం అయింది. ఎన్టీఆర్ చ‌రిష్మాను ఓన్ చేసుకోవ‌డానికి మాస్ట‌ర్ స్కెచ్ వేసింది. ఖ‌మ్మం న‌డిబొడ్డున ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని రూ. 3కోట్ల రూపాయాల‌తో నిర్మిస్తోంది. అంతేకాదు, ఆ విగ్ర‌హాన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్ తో ఆవిష్క‌రించ‌డం ద్వారా సానుకూల వాతావ‌ర‌ణాన్ని సృష్టించుకోవాల‌ని గులాబీ పార్టీ భావిస్తోంది. అయితే, తెలుగుదేశం పార్టీని ఉద్దేశ పూర్వ‌కంగా న‌ష్ట‌ప‌రిచిన కేసీఆర్ పై ఖ‌మ్మం ఓట‌ర్లు గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. అందుకే, అక్క‌డ గులాబీ పార్టీకి చోటు లేకుండా పోయింది. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు ఇటీవ‌ల హైద‌రాబాద్ లోని హైటెక్స్ వ‌ద్ద ఆ కులం పెద్ద‌ల‌కు 5 ఎక‌రాల‌ను క‌మ్మ సంఘం కోసం మంటూ ప్ర‌భుత్వం కేటాయించింది. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ క‌ట్టారు. ఇప్పుడు ఖ‌మ్మం కేంద్రంగా ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం ద్వారా ఖ‌మ్మంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క‌మ్మ. సామాజిక‌వ‌ర్గాన్ని సానుకూలంగా మ‌లుచుకోవాల‌ని టీఆర్ఎస్ ఎత్తుగ‌డ వేసింది. అందుకే, తెలుగుదేశం పార్టీ పూర్వ వైభ‌వం కోసం కేసీఆర్ ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తు చేస్తూ చాప‌కింద‌నీరులా విస్త‌రిస్తోంది.

ఎన్టీఆర్ గార్డెన్ వ‌ద్ద అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని టీఆర్ఎస్ పార్టీ నిర్మిస్తోంది. గార్డెన్ కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్రాధాన్యం త‌గ్గుతుంద‌ని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళ‌న చేశారు. అయిన‌ప్ప‌టికీ తీరు మార్చుకోని టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్ర‌హాల ద్వారా ఆయ‌న చ‌రిష్మాను సొంతం చేసుకోవాల‌ని చూస్తోంది. ఇంకో వైపు ట్యాంకు బండ్ మీద ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను తొల‌గించాల‌ని ఒక‌ప్పుడు డిమాండ్ చేసిన గులాబీ నేత‌లు హ‌ఠాత్తు ఎన్టీఆర్ పై ప్రేమ పెంచుకున్నాట్టు క‌నిపిస్తున్నారు. దీనంత‌టికీ కార‌ణం చాప‌కింద‌నీరులా బ‌ల‌ప‌డుతోన్న టీడీపీ ని దెబ్బ‌కొట్ట‌డానికి కేసీఆర్ వేస్తోన్న ఎత్తుగ‌డ‌గా అభిమానులు ఇప్ప‌టికే గ్ర‌హించారు. మొత్తం మీద ఈసారి తెలంగాణ టీడీపీ కేసీఆర్ చుక్కులు చూపించ‌నుంద‌న్న‌మాట‌.