CM KCR: కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో మళ్లీ “2018 సీన్ రిపీట్” చేయనున్నారా..?

  • Written By:
  • Publish Date - March 20, 2022 / 10:50 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఎప్పుడు ఏది చేసినా కూడా… దాని వెనుక ఓ పక్కా వ్యూహం ఉంటుందని అంటుంటారు ఆయన గురించి తెలిసిన రాజకీయ నేతలు, పొలిటికల్ అనలిస్టులు. గతంలో కొన్ని సందర్భాలను మనం పరిశీలిస్తే… ఈ విషయం మనకు స్పష్టం అవుతుంది. 2018 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ పక్కా వ్యూహంతో తన మార్క్ రాజకీయాన్ని చూపించారు.

ఆ సమయంలో ప్రతిపక్షాలు, ఇతరులకు తెలియకుండా సడెన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసి ఏ మాట్లాడారో తెలీదు గానీ, హస్తిన నుంచి హైదరాబాద్ రాగానే… తెలంగాణలో అసెంబ్లీని రద్దుచేసి, ముందస్తు ఎన్నికలు ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారం చేపట్టారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే… మరోసారి ఢిల్లీ బాట పట్టబోతున్నారు సీఎం కేసీఆర్. మరి ఈసారి హస్తిన పర్యటనలో ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారా అనేది సర్వత్రా ఆశక్తి నెలకొంది.

గులాబీ దళపతి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈనెల 21న మంత్రులతో కలిసి హస్తిన వెళ్లనున్నారు కేసీఆర్. మంత్రుల బృందంతో కలసి కేసీఆర్… ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరనున్నారు. మరోవైపు ఈనెల 21న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగనుంది. ఆ తర్వాత కేసీఆర్ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు.

కేసీఆర్ హస్తిన పర్యటన నేపథ్యంలో… తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి కేసీఆర్… తన పర్యటనలో దేశ ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిశాక… తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ప్రకటిస్తారని.. ఈ మేరకు 2018 నాటి సంఘటనలే పునరావృతం అవుతాయేమోనని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. విపక్షాల అనుమానాలకు తావిచ్చేలా కేసీఆర్ చర్యలు కనిపిస్తున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర సమావేశం పెట్టినట్టు మీడియాలో పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు ఫాంహౌస్ కు మంత్రులను పిలిపించారని.. అందరూ తరలివచ్చారని అంటున్నారు. మంత్రులతో గులాబీ దళపతి కేసీఆర్ ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కేసీఆర్ కాలపరిమితి మరో రెండేళ్లు ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే… ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నట్లు పలు సర్వేలు తేటతెల్లం చేయడంతో… ఇంకా ఆలస్యం చేస్తే… మరింత నష్టపోవాల్సి ఉంటుందని… అందుకే ముందస్తుకు వెళ్తేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తేనే విజయం దక్కుతుందని కేసీఆర్ మంత్రులతో అన్నట్టు మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఫుల్ టైం అంటే… 2023 వరకూ ఉంటే… ఆ తర్వాత గెలుపు కష్టమని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కేసీఆర్ కు రిపోర్ట్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే ఇప్పుడే ఎన్నికలకు వెళితే…. ఆ వ్యతిరేకత అధిగమించవచ్చని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఫాం హౌజ్ లో మినిస్టర్స్ తో మీటింగ్ తర్వాత కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడంతో…. ఇప్పుడు ఆ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనంతరం ముందస్తు ఎన్నికలకు వెళతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ అడుగులు కూడా అటువైపే పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అపర చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ వ్యూహాలను పసిగట్టడం అనేది అంత ఈజీ కాదు. మరి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లేది ముందస్తు ఎన్నికలకోసమేనా..? లేదంటే… తాను చెబుతున్నట్టుగా కేంద్రంపై యుద్దానికా…? అనేది వేచి చూడాలి.