జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ బీజేపీ పై గర్జించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. పబ్లిక్ గార్డెన్ వేదికగా జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఫక్తు రాజకీయ ప్రసంగం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఢీకొనేందుకు టీఆర్ఎస్ ప్రస్తుతం ఏం చేస్తోంది ? ఇకపై ఏం చేయబోతోంది ? అనే దానిపైనా కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. బీజేపీయేతర రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు జరుపుతున్న ప్రయత్నాల గురించి కూడా కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. తెలంగాణ విషయంలో ప్రతీకార ధోరణితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు కేసీఆర్ మొగ్గుచూపే అవకాశం ఉంది.
తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడంలో తెలంగాణ చాలా పక్కాగా ఉన్నా.. మళ్లీ కొత్త అప్పులను ఇవ్వడంలో మోకాలు అడ్డుపెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందనే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించొచ్చు. తెలంగాణ ప్రభుత్వం వరుస విజ్ఞప్తులు చేసినా.. వ్యవస్థాగత రుణాలను తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతులు ఇవ్వలేదని చెప్పేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నారు. ఏప్రిల్, మే నెల సెక్యూరిటీ బాండ్లను వేలం వేయకుండా తెలంగాణ సర్కారుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కళ్లెం వేసింది. ఈ విషయాన్ని కూడా కేసీఆర్ తన ప్రసంగంలో ఫోకస్ చేసే సూచనలు ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గవర్నర్ తమిలిసై ను ఆహ్వానించే అవకాశాలు లేవని తెలుస్తోంది. గత 8 ఏళ్లలో సాధించిన తెలంగాణ పురోగతి, బంగారు తెలంగాణ సాధనకు సిద్ధం చేసిన ప్రణాళిక గురించి కేసీఆర్ ఈసందర్భంగా వివరించనున్నారు.