తెలంగాణ వార్షిక బడ్జెట్ (Telangana Budget 2024 – 25) ను గురువారం అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశ పెట్టగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే పలు శాఖలకు నిధులు కేటాయిస్తున్నట్లు ఆ వివరాలు పేర్కొన్నారు. కాగా భట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫై మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభకు హాజరైన కేసీఆర్..బడ్జెట్‌పై మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ విధానపరంగా లేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలని అనుకున్నామని, కానీ ఆ ప్రభుత్వానికి అసలు పాలసీనే లేదని బడ్జెట్ చూశాక అర్థమైందని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో దళితబంధు ప్రస్తావనే లేదని, ప్రభుత్వం దళితుల గొంతు కోసిందని ఆరోపించారు. బడ్జెట్లో భట్టి వట్టి మాటలు చెప్పారని.. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. భట్టి చేసిన బడ్జెట్ ప్రసంగం ఓ కథలా, రాజకీయ ప్రసంగంలా ఉందని అన్నారు. ప్రభుత్వం రైతులను వంచించిందని, బడ్జెట్లో ఒక్క పాలసీ ప్రకటించలేదని, ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదని విమర్శించారు. ఏ ఒక్క దానిపైనా క్లారిటీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకూ ఇచ్చిందేమి లేదని, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదని , మత్స్యకారులకు భరోసా లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదు..రైతు శత్రువు ప్రభుత్వం అని, అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు ఎగ్గోడతామంటున్నారని మండిపడ్డారు. గొర్రెల పంపిణీ ఊసే లేదని, దళిత బంధు ప్రస్తావనే లేకుండా దళితులను మోసం చేశారని పేర్కొన్నారు.
Read Also : Telangana Budget 2024 – 25 : ఎల్లుండికి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
