CM KCR: వడ్ల కొనుగోలుపై సీఎం కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ తో బీజేపీ షాకేనా?

తెలంగాణలో వడ్ల రాజకీయం ఢిల్లీ నుంచి మళ్లీ తెలంగాణ గల్లీకి వచ్చింది. సీఎం కేసీఆర్ విధించిన 24 గంటల డెడ్ లైన్ కు కేంద్రం స్పందన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది.

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 09:15 AM IST

తెలంగాణలో వడ్ల రాజకీయం ఢిల్లీ నుంచి మళ్లీ తెలంగాణ గల్లీకి వచ్చింది. సీఎం కేసీఆర్ విధించిన 24 గంటల డెడ్ లైన్ కు కేంద్రం స్పందన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది. మరిప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి? ఎందుకంటే పది రోజులపాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. సోమవారం దీక్ష ముగింపు తరువాతే హైదరాబాద్ వచ్చారు. దీంతో అక్కడ చక్రం తిప్పి ధాన్యాన్ని కొనేలా చేస్తారేమో అని తెలంగాణ రైతులు ఆశగా ఎదురుచూశారు. కానీ 24 గంటల డెడ్ లైన్ విధించి ఆయన వచ్చేశారు. మరిప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి?

యాసంగి వడ్లను కేంద్రాన్ని కొనమంటే కొనదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వం కొనకుండా ఉండలేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. అది టీఆర్ఎస్ పై ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రత్యామ్నాయ చర్యలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఓవైపు దీనిపై న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడ్డారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోలు ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు.

కిందటి సీజన్ లోనూ వడ్ల కొనుగోలు అంశం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ఇప్పుడూ అదే సమస్య ఎదురైంది. అందుకే వడ్ల కొనుగులు సమస్యగా మారకుండా.. వర్షాకాలం పంటలపై ఏం చేయాలన్నది మంత్రిమండలి చర్చిస్తుంది. దీంతోపాటు ధాన్యం కొనుగోళ్లలో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలంటూ ఎలుగెత్తనుంది. దీనిపై జాతీయస్థాయిలో రైతు సంఘాలు, ఆహార నిపుణులు, వివిధ పార్టీలను ఆహ్వానించి ఢిల్లీలోనే సదస్సు ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఈ సీజన్ లో ఎలా లేదన్నా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సి రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ప్రభుత్వమే ధాన్యాన్ని కొని బహిరంగంగా వేలం వేయడమా.. లేదా గత పద్దతిని అనుసరించడమా అన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి వడ్ల కొనుగోలు అంశం క్లైమాక్స్ కు చేరింది. ఇప్పుడు బీజేపీకి షాక్ ఇచ్చేలా కేసీఆర్ నిర్ణయం ఉంటుందంటున్నారు. రిజల్ట్ ఎలా ఉన్నా రైతు నష్టపోకుండా ఉంటే చాలు.