KCR Chandrababu : 20ఏళ్ల నాటి ‘కేసీఆర్‌’ కుట్ర

సుమారు 20ఏళ్ల క్రితం చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై జ‌రిగిన కుట్ర కోణం ఇప్పుడు వెలుగుచూసింది.

  • Written By:
  • Updated On - June 3, 2022 / 05:41 PM IST

సుమారు 20ఏళ్ల క్రితం చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై జ‌రిగిన కుట్ర కోణం ఇప్పుడు వెలుగుచూసింది. కుట్ర జ‌రిగిన తీరును మాజీ మంత్రి, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, మాజీ టీడీపీ లీడ‌ర్ ఏ. చంద్ర‌శేఖ‌ర్ బ‌య‌ట‌పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉన్నంత అధికార‌దాహం ప్ర‌పంచంలో ఎవ‌రికీ ఉండ‌దంటూ ఆనాటి కుట్ర‌ను ఉద‌హ‌రించ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పటి సహచరుడు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఏ.చంద్రశేఖర్. తెలంగాణ ఆవిర్భావం సంద‌ర్భంగా నాగోల్ లో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ ఎనిమిదేళ్ల కేసీఆర్ పాల‌న, ఆయ‌న తీరును ఎండ‌గ‌ట్టారు. ఆ సంద‌ర్భంగా త‌న‌కు, కేసీఆర్ కు ఉన్న అనుబంధాన్ని ఆనాటి రాజ‌కీయాల‌ను ఉటంకించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాను, కేసీఆర్ ఒకేసారి మంత్రులమయ్యామని చెప్పారు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు కేసీఆర్ కి మంత్రి పదవి ఇవ్వలేదని, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారన్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ గా ఉంటూనే చంద్రబాబునాయుడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నాల‌ను పూస‌గుచ్చిన‌ట్టు వెల్ల‌డించారు.

“చిత్తూరు జిల్లాకు చెందిన గోపాలకృష్ణారెడ్డి, నేను, మరికొంత మంది మిత్రులు కలిసి చంద్రబాబును దించేయాలనేది కుట్ర. ఇందుకోసం 3, 4 నెలల పాటు చర్చలు, ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబును దించేందుకు దగ్గరికొస్తున్నాం కాబట్టి ఒక రోజు రాత్రి ప్లాన్‌ చేశాం. సీఎంను దించడానికి 60 మంది ఎమ్మెల్యేలు చాలని కేసీఆర్ చెప్పారు. 20 హెలికాప్టర్లు తెచ్చుకుందాం. నేరుగా గవర్నర్‌ వద్దకు వెళ్దామని ఆయన అన్నారు. చంద్రబాబును దించేసిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలని ఆకాంక్ష. ఆనాటి మీటింగ్‌కు ముఖ్యమంత్రిలా సూటు, బూటు వేసుకొని వచ్చిండు. బొజ్జల గోపాలకృష్ణ సరదాగా నువ్వేందుకు ముఖ్యమంత్రి కావాలి? అన్నందుకు ఆయన్ను కొట్టినంత పనిచేసిండు’` అని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.

ముందుగా ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా కేసీఆర్, నేను, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తోపాటు మరికొందరం కలిశామన్నారు. దీనిపై నాలుగు నెలలపాటు చర్చలు తీవ్రంగా సాగాయని, చివరగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 60 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని తెలిపారు. ఎమ్మెల్యేల‌ సంఖ్య సరిపోతుందని, గవర్నర్ ను కలుద్దామని కేసీఆర్ అన్నారట‌. అయితే చివరగా 61వ ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూను సంప్రదించడంతో ఆయన చంద్రబాబుకు విషయాన్ని తెలియజేశారని చెప్పారు. దీంతో ఆయ‌న ప్ర‌య‌త్నం బెడిసికొట్టింద‌ని వివ‌రించారు.

ఉద్యమ సమయంలో దళితుల విషయంలోనూ కేసీఆర్ ఇలాగే మోసపూరిత మాటలు చెప్పారని చంద్రశేఖర్ ఆరోపించారు. ‘దళితులు ఉద్యమంలోకి ఎందుకొస్తలేరని భావించి, అంబేద్కర్ భవన్‌లో అప్పటికప్పుడు మీటింగ్ పెట్టిండు. ఆచరణ సాధ్యంకాని హామీలు వద్దని విజయ రామారావు వారిస్తున్నా వినకుండా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటన చేశాడు’ అని చంద్రశేఖర్ చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో ఒక రోజు ‘ఎవడినో ముఖ్యమంత్రిని చేసేందుకు ఇంత కష్టపడాలా?’ అని కేసీఆర్ అన్నారని ఆరోపించారు. ఉద్యమకారులందరినీ కేసీఆర్ బయటకి పంపారని.. బీజేపీ మీద నమ్మకంతోనే పార్టీలో చేరామని చంద్రశేఖర్ అన్నారు. ‘8 ఏళ్లుగా ఆకాంక్షలకు తూట్లు పొడిచిండంటూ ఆయ‌న ప్ర‌సంగాన్ని ముగించారు. దాన్లో ఆనాటి కుట్ర కోణం హైలెట్ గా నిలిచింది.