Site icon HashtagU Telugu

KTR: దక్షిణ భారత్ లో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారు: మంత్రి కేటీఆర్

Protests Of IT Employees

KTR Meeting with Khammam Bhadradri Leaders in Telangana Bhavan Interesting comments on Congress

KTR: ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మూడవసారి ముమ్మాటికి అధికారంలోకి వచ్చేది భారత రాష్ట్ర సమితినే అని, దక్షిణ భారతదేశంలో తొలిసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు ఏకపక్షమే అని, భారత రాష్ట్ర సమితికి భారీ విజయం ఖాయం అన్నారు. రెండుసార్లు ప్రజలు నిండు మనసుతో ప్రజా ఆశీర్వాదం అందించారని మూడోసారి కూడా ప్రజలు భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. డిసెంబర్ 3న వచ్చే ఎన్నికల ఫలితాల ద్వారా సబ్బండ వర్గాలకు సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ కెసిఆర్ గారు ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి అవుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పదేళ్ల కాలంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలకు అందించిన అభివృద్ధిని పాశుపతాస్త్రంగా మార్చుకొని ప్రతిపక్షాలపై విజయం సాధిస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన మా విశ్వసనీయతనే ఈ ఎన్నికల్లో తమ విజయ మంత్రంగా మారుతుందని తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న ప్రజా వ్యతిరేక శక్తులకు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎన్నికల్లో మరొకసారి ఓటమి తప్పదని, ప్రజల మద్దతుతో గులాబీ జెండాను మరోసారి ఎగరేస్తామన్నారు. నిరంతరం ప్రజలకు మంచి చేసిన టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేస్తారని, ప్రజలను ముంచిన కాంగ్రెస్, బిజెపి పార్టీల పైన వేటు వేస్తారన్నారు

ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలో మా పార్టీ అభ్యర్థులు ఉన్నారని, టిఆర్ఎస్ పార్టీ కెప్టెన్,ముఖ్యమంత్రి అభ్యర్థి కెసిఆర్ అని మరోవైపు ప్రతిపక్షాలకు ముఖ్య మంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప గాడ్సే సిద్ధాంతాలు నడవవు అని అన్నారు. ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు భారత రాష్ట్ర సమితి శ్రేణులు సమరోత్సహంతో కదం తొక్కుతున్నాయని ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఎగరవేయాలన్న బలమైన కోరిక కనిపిస్తుందన్నారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం నిబద్ధతతో చేసిన పోరాటాన్ని ప్రజలు గుర్తించి 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిపించారని, ఆ తర్వాత సబ్బండ వర్గాలకు అందించిన సంక్షేమ కార్యక్రమాల వలన 2018లో మరోసారి ప్రజలు భారత రాష్ట్ర సమితిని దీవించారన్నారు. ఈసారి జరిగిన పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలు గుర్తించి మరోసారి పట్టం కడతారన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉన్నదని, యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం చేసిందని, పోటీకి ముందే బిజెపి కాడి ఎత్తేసింది అని అన్నారు. తెలంగాణ చరిత్ర బిఆర్ఎస్ తోనే అన్న కేటీఆర్ తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కూడా కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. ఈసారి 100 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి పాత రికార్డులను టిఆర్ఎస్ పార్టీ తిరగరాస్తుందని, పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తుందన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.