వరి ధాన్యం కొనుగోలు, సింగరేణి వేలం అంశాలపై తాడేపేడో తేల్చుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ వాలకంపై ఉద్యమం చేయడానికి ప్రణాళికను రచిస్తున్నాడని తెలుస్తోంది. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణి గనులను వేలం వేయడానికి కేంద్రం సిద్ధం అవుతోంది. తొలి విడత నాలుగు బ్లాక్ లను వేలం వేయబోతుంది. ఎలాగైనా ఈ వేలాన్ని అడ్డుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నాడట. అందుకోసం పోరాట షెడ్యూల్ ను ప్రకటించడానికి పార్టీ కసరత్తు చేస్తోందని వినికిడి.వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఇటీవల టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వం మీద పార్లమెంట్ వేదికగా విరుచుకుపడ్డాడు. ఒప్పందం ప్రకారం ఎఫ్ సీఐకి ఇవ్వాల్సిన ముడి, రా బియ్యం కోటాను ఇంకా తెలంగాణ సర్కార్ పూర్తి చేయలేదని ప్రకటించాడు. వేగంగా వరి ధాన్యం కొనుగోలు చేసి బియ్యం సరఫరా చేయాలని కోరాడు. తద్భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం వరి కొనుగోలు చేయడంలేదని వాదిస్తోంది. ఎంత కొనుగోలు చేసేది ఇప్పటి వరకు కేంద్రం చెప్పలేదని పార్లమెంట్ వేదికగా ప్ల కార్డులతో ఎంపీలు నినదించారు. ఏమైందో…ఏమో అకస్మాత్తుగా పార్లమెంట్ ను బహిష్కరించి హైదరాబాద్ కు ఎంపీలు చేరుకున్నారు.
ఈ రెండు కీలక అంశాలపై కేంద్రం మీద ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. రాబోవు 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే కేంద్రం ప్రభుత్వం మీద రాజకీయ పోరాటానికి కేసీఆర్ షూరూ చేశాడు. పైగా సింగరేణి అమ్మకం అనేది తెలంగాణ సెంటిమెంట్. అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు కూడా తరలి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే, ఇప్పుడు కేసీఆర్ సెంటిమెంట్ ను మరోసారి నమ్మకుని వచ్చే ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నాడు. అవసరమైతే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న కార్మికులను కూడా కలుపుకుని పోవాలని ఆయన ఆలోచిస్తున్నాడట.
సో..మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ అడుగులు వేయడానికి రెండు అస్త్రాలు బలంగా దొరికాయి. ఇదే ఊపుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన కూడా ఆయన చేస్తున్నాడని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ్రంట్ కోసం మమత వేస్తోన్న అడుగులకు కేసీఆర్ కూడా ఊతం ఇస్తున్నాడు. ఉత్తర భారతనా దీదీ దక్షిణ భారతదేశాన కేసీఆర్ ఫ్రంట్ కోసం యోచిస్తున్నారు. ఆ దిశగా రాజకీయాలను వేడెక్కించడానికి సింగరేణి వేలం, ధాన్యం కొనుగోలు అస్త్రాలను కేంద్రంపై సంధించడానికి దొరికాయి. ఉద్య కార్యాచరణ రూపొందించడంలో దిట్టగా పేరున్న కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగుతాడా? లేక మరో ప్రణాళిక ఆయన వద్ద ఉందా? అనేది త్వరలోనే తేలనుంది.