- ప్రజల్లోకి కేసీఆర్
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నిసందర్శన
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీ సమావేశాల ముగిసిన వెంటనే రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తొలి బహిరంగ సభను ఉమ్మడి మహబూబ్ నగర్ (MBNR) జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పాలమూరు గడ్డపై నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట శంఖారావాన్ని పూరించడం ద్వారా దక్షిణ తెలంగాణలో పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.
Kcr Pm
ఈ పర్యటనలో ప్రధానాంశం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS). దక్షిణ తెలంగాణకు జీవనాడి వంటి ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు నీరు అందించాలనే తన లక్ష్యానికి ప్రస్తుత ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని, నిధుల కేటాయింపులో జాప్యం చేస్తోందని ఆయన వాదిస్తున్నారు. స్వయంగా ప్రాజెక్టును సందర్శించడం ద్వారా, క్షేత్రస్థాయిలో పనులు ఏ మేరకు నిలిచిపోయాయో ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలనేది ఆయన వ్యూహం.
ఎన్నికల తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న కేసీఆర్, ఇప్పుడు మళ్ళీ ప్రజల మధ్యకు వస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల అంశం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున, దానినే అస్త్రంగా మార్చుకోవాలని ఆయన చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్‌కు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకోవడంతో పాటు, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
