Site icon HashtagU Telugu

KCR vs Centre: మా అప్పులపై మీ ఆంక్షలా? కేంద్రంపై కేసీఆర్ ఫైర్

Kcr Pm

Kcr Pm

కేంద్రప్రభుత్వం వైఖరిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాల విధానం వల్ల, సిద్దాంతం వల్ల రాష్ట్రాల హక్కులు హరించుకుపోతాయని ఆరోపించారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిస్తే.. దానివల్ల కేంద్రానికే నష్టమన్నారు. కేంద్రం పన్నులు విధిస్తే అందులో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. అందుకే కేంద్రం తెలివిగా.. పన్నులను కూడా సెస్సుల రూపంలో వసూలు చేస్తోంది. దీనివల్ల ఆ ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల రాష్ట్రాలకు దక్కాల్సిన లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికే మిగిలిపోతున్నాయంటూ విమర్శించారు కేసీఆర్.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని చెప్పడం మంచిదే అయినా.. మరి మోదీ సర్కారు ఎందుకు విచ్చలవిడిగా అప్పులు చేస్తోందంటూ ప్రశ్నించారు. రాష్ట్రాలపై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. తెలంగాణ రూ.25 వేల కోట్లను నష్టపోవాల్సి వస్తోందని.. ఇప్పుడు ఆ డబ్బును అప్పు రూపంలో తెచ్చుకోవాలంటే.. మోటార్లకు మీటర్లు పెట్టాలని.. రైతుల నుంచి కరెంట్ ఛార్జీలు వసూలు చేయాలని చెబుతున్నారంటూ కేంద్రం వైఖరిని తీవ్రంగా విమర్శించారు కేసీఆర్. కానీ తాము మాత్రం రైతుల శ్రేయస్సును దృష్టిలోపెట్టుకుని విద్యుత్ మీటర్లు పెట్టబోవడం లేదన్నారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ స్కీములు నచ్చడంతో నీతి అయోగ్ ఏకంగా రూ.24 వేల కోట్లను తెలంగాణకు ఇవ్వాలని చెప్పిందని అయినా కేంద్రం ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశ ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలకు తాము వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు కేసీఆర్.