TRS Group Politics: టీఆర్ఎస్ ‘వర్గపోరు’పై కేసీఆర్ ఫైట్!

త్వరలో జాతీయ రాజకీయాల్లోకి దూసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ కేసీఆర్‌.. ముందుగా పార్టీ అంతర్గత విభేదాలు, గ్రూప్

  • Written By:
  • Updated On - November 19, 2022 / 02:07 PM IST

త్వరలో జాతీయ రాజకీయాల్లోకి దూసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ కేసీఆర్‌.. ముందుగా పార్టీ అంతర్గత విభేదాలు, గ్రూప్ పాలిటిక్స్ పై గురి పెట్టనున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అవకాశాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అంతర్గత విభేదాలు లేదా గ్రూపు రాజకీయాలు లేకుండా చూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. నేతల మధ్య విభేదాలు సద్దుమణిగేలా, సమస్యాత్మక అసెంబ్లీ సెగ్మెంట్లను గుర్తించే పనిలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. పాత వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రక్షాళన షురూ చేయనున్నట్టు సమాచారం.

గ్రూపు రాజకీయాలకు ముగింపు పలకకపోతే బీజేపీలోకి చేరికలు ఉండే అవకాశం ఉందనీ, ఇప్పటికే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని టీఆర్‌ఎస్ అగ్రనేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో  టీకెట్స్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్‌ ఇస్తామని కేసీఆర్‌ ఇటీవల ప్రకటించడం అభ్యర్థుల్లో అసంతృప్తికి గురిచేసింది. అలాంటి వారందరినీ టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ శాసనసభ్యులు, సీనియర్‌ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు సర్వసాధారణమే. ఈ అంశం బీజేపీకి అవకాశం ఇవ్వకుండా,  టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతినకుండా కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తారని తెలుస్తోంది.

Also Read:  Kavitha TRS: బీజేపీ ఆప‌రేష‌న్లో తెలంగాణ లేడీ షిండే

కోదాడ, కొల్లాపూర్, తాండూరు, కల్వకుర్తి, నాగార్జున సాగర్, స్టేషన్ ఘన్‌పూర్, ఉప్పల్, హుజూరాబాద్, పాలేరు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గ్రూపు రాజకీయాలు ఎక్కువ. ఈ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కేసీఆర్ త్వరలో చర్చలు జరుపుతారని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరిస్తారని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయగల అసంతృప్త నేతల వివరాల జాబితాను కేసీఆర్ ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం.

స్థానిక,  రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన పోస్టులను అందించడం ద్వారా వారిని శాంతింపజేసే అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరలో ఖాళీగా ఉన్న స్థానాలకు సీనియర్‌ నేతలకు నామినేట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘నేతల మధ్య అంతర్గత పోరు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో, ప్రతిపక్ష పార్టీలు తమను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్న చోట అన్ని రాజకీయ పరిణామాలను తనకు తెలియజేసే బాధ్యతను కేసీఆర్ అప్పగించారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, కేసీఆర్ తగిన నిర్ణయాలు తీసుకుంటారు’’ టీఆర్ఎస్ సీనియర్ ఒకరు మీడియాతో వెల్లడించారు.

Also Read:  Revanth Reddy: ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్.. ప్రత్యేక కార్యాచరణలో రేవంత్!