Site icon HashtagU Telugu

KCR Delhi Tour : ఢిల్లీ గేమ్‌..గ‌ల్లీ ఫైట్‌.!

ప్ర‌ధాన మంత్రిని క‌ల‌వాలంటే ముందుగా అపాయిట్మెంట్ తీసుకోవాలి. పీఎంవో కార్యాల‌యం నిర్దేశించిన టైంకు వెళ్లాలి. ఎవ‌రు క‌ల‌వాల‌న్నా..ఇదే ప్రొటోకాల్ ఉంటుంది. షెడ్యూల్ కుద‌ర‌క‌పోతే అపాయిట్మెంట్ నిరాక‌రించ‌డం త‌ర‌చూ చూస్తుంటాం. అందుకు భిన్నంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో మోడీని క‌ల‌వాల‌ని భావించ‌డం గ‌మనార్హం. స‌రిగ్గా ఇక్క‌డే కేసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉంది.తెలంగాణ రాష్ట్ర స‌మితి శాస‌న స‌భాప‌క్షం స‌మావేశం ముగిసిన త‌రువాత ఢిల్లీ వెళ్ల‌డానికి కేసీఆర్ సిద్ధం అయ్యాడు. ఆ స‌మావేశంలో మునుప‌టి మాదిరిగా వ్యూహాన్ని ర‌చించిన‌ట్టు తెలుస్తోంది. క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేలు ధ‌ర్నాలు, ఆందోళ‌న‌కు దిగేలా దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత ఇలాంటి హ‌డావుడి వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేసీఆర్ స‌ర్కార్ చేసింది. ఇప్పుడు కూడా ఢిల్లీకి సీఎం వెళుతున్న స‌మ‌యంలో తెలంగాణ అంత‌టా వ‌రి ధాన్యం కొనుగోలు డిమాండ్ తో పోరాటాలు చేయాలి. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను కేంద్ర నిఘా వ‌ర్గాలు మోడీ స‌ర్కార్ తెలియ‌చేయ‌డం స‌హ‌జంగా జ‌రుగుతుంది. అప్పుడు ప్ర‌ధాని అపాయిట్మెంట్ కేసీఆర్ అడిన‌ప్ప‌టికీ వెంట‌నే ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌దు.

రైతుల స‌మ‌స్య‌పై అపాయిట్మెంట్ అడిగిన‌ప్ప‌టికీ ఇవ్వ‌లేద‌ని మోడీ స‌ర్కార్ ను బ‌ద్నాం చేయ‌డానికి ఒక అస్త్రం టీఆర్ఎస్ కు దొరుకుతుంది. ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన త‌రువాత కేసీఆర్ అదే విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయ‌డానికి స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తాడు. స‌హ‌జంగా ఇలాంటి ఎత్తుగ‌డ‌నే కేసీఆర్ ర‌చిస్తాడు. అందుకు భిన్నంగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏమీ చేయ‌లేడు. ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంద‌ని పీకే ఇచ్చిన స‌ర్వే ఆధారంగా మోడీ స‌ర్కార్ ను టార్గెట్ చేయ‌డ‌మే మార్గ‌మ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. సేమ్ టూ సేమ్ బెంగాల్ సీఎం మ‌మ‌త వేసిన అడుగులను కేసీఆర్ చేత వేయించాల‌ని పీకే వ్యూహం ర‌చించాడ‌ని తెలుస్తోంది.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వ‌చ్చిన త‌రువాత ఫ్రంట్ నినాదం కేసీఆర్ నోట చ‌ల్ల‌బ‌డింది. ప్ర‌త్యామ్నాయ వ్యూహాన్ని కేసీఆర్ స‌హ‌జంగా ఎంచుకోవాలి. మోడీ స‌ర్కార్ తో ఏదో ఒక విధంగా లైజ‌నింగ్ చేసేలా ఎత్తుగ‌డ వేస్తాడ‌ని గ‌త అనుభ‌వాల ఆధారంగా భావించొచ్చు. కానీ , పీకే ఇస్తోన్న గైడెన్స్ ప్ర‌కారం పోరాటాల‌కు దిగుతున్నాడ‌ని తెలుస్తోంది. స‌హ‌జ‌త్వానికి భిన్నంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నాడ‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. మూడోసారి సీఎం కావ‌డానికి పూర్తిగా పీకే స‌ర్వేలు, వ్యూహాల మీద కేసీఆర్ ఆధార‌ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. అందుకే, మరోసారి వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని రాజ‌కీయ అస్త్రంగా కేంద్రంపై విస‌ర‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు వినికిడి.

సాధార‌ణంగా కేసీఆర్ వేసే ఎత్తుగ‌డ ఒక‌టి ఉంటే బ‌య‌ట‌కు మ‌రొక‌టి ఫోక‌స్ అవుతుంది. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పీకేను నియ‌మించుకున్న‌ప్ప‌టికీ గుడ్డిగా కేసీఆర్ ఫాలో అయ్యే నాయ‌కుడు కాదు. ఆయ‌న‌కంటూ కొన్ని ఎత్తుగ‌డ‌లు ఉంటాయి. పీకే సల‌హా మేర‌కు వ‌రి ధాన్యం కొనుగోలు అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీసిన‌ట్టు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ఢిల్లీ వెళ్లిన త‌రువాత మ‌రో వ్యూహంతో కేసీఆర్ వెళ్లినా ఆశ్చ‌ర్యం లేదు. ప్ర‌స్తుతం బీజేపీ దేశంలో బ‌లంగా ఉంది. ఆ పార్టీతో పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు చాలా వ‌ర‌కు క‌నుమ‌రుగు అయ్యాయి. ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ టీడీపీ. ఆ అనుభ‌వాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మోడీ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా కేసీఆర్ వెళ్ల‌డానికి అవ‌కాశం త‌క్కువ‌.తాజాగా బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర‌రావు చెబుతున్న దాని ప్ర‌కారం కేసీఆర్ చాలా ఘోర‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కోబోతున్నాడ‌ట‌. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌ధాని మోడీని క‌లిసి 50వేల కోట్ల బొగ్గు కుంభ‌కోణం జ‌రిగింద‌ని ఫిర్యాదు చేశాడు. అలాంటి ఫిర్యాదులు కాళేశ్వ‌రం, మిష‌న్ భగీర‌థ‌, కాక‌తీయ త‌దిత‌ర ప‌థ‌కాల్లోని అవినీతిపై ఉన్నాయి . వీటికి తోడు గ‌తంలో కేసీఆర్ పై న‌మోదైన కేసులు విచార‌ణ‌కు నోచుకోలేదు. వాటినితెర‌మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని బీజేపీ నేత‌లు బాహాటంగా చెబుతున్నారు. ఖ‌చ్చితంగా కేసీఆర్ ను జైలుకు పంపుతామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ చాలా కాలంగా చెబుతున్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ కేంద్రంపై దాడికి దిగ‌తాడ‌ని అనుకోలేం. ప్ర‌శాంత కిషోర్ స‌ర్వేలు, వ్యూహాల‌ను కేసీఆర్ తాత్కాలికంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ప్ప‌టికీ మోడీ స‌ర్కార్ పై గుడ్డిగా పోరాటం చేయ‌డానికి వెళ్ల‌డ‌ని పార్టీలోని కొన్ని వ‌ర్గాల చ‌ర్చ‌. గ‌తంలో మాదిరిగా లైజ‌నింగ్ కు వెళ్ల‌డం ద్వారా రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు స‌హ‌కారం అందించే ఛాన్స్ ఉంద‌ని అంత‌ర్గ‌తంగా వినిపిస్తోన్న మాట‌లు. సో..కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసిన త‌రువాత‌గానీ కేంద్రంపై పోరాట‌మా? లేక తెర వెనుక మిత్ర‌త్వ‌మా? అనేది కొంత మేర‌కు తేల‌నుంది.