KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి (డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ముఖాముఖీగా మాట్లాడారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రణాళికలు, ప్రభుత్వ పనితీరు, నిర్బంధ పాలన పై బీఆర్ఎస్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తావిస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా అవి ఎలా ఎదుర్కోవాలనే విషయాలను వారికి సూచించారు.
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాల పట్ల ప్రభుత్వం అనేక దారుణాలను ప్రదర్శించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు వ్యవహారంపై కేసీఆర్ వ్యాఖ్యానిస్తూ… ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని, దాని మార్పు మూర్ఖత్వమని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని ప్రజలకు గుర్తు చేయాలని కేసీఆర్ అన్నారు.
అంతేకాకుండా… కేసీఆర్, డిసెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రైతుబంధు పథకం, కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి మాట్లాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. వీటితో పాటు.. థర్మల్ పవర్ ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్ నివేదిక, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలను ప్రస్తావించాలని తెలిపారు. ఈ సభల్లో, అన్ని అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఆరోపణలను ఎదుర్కొనే విధంగా సిద్ధం కావాలని సూచించారు.
అంతేకాకుండా, ఫిబ్రవరి నెలలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించేందుకు ముందుకు వెళ్లనున్నట్లు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా ప్రణాళికలు తయారు చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి తరువాత, బీఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభిస్తామని, పార్టీ పటిష్టీకరణకి ఆ దిశలో పని చేస్తామని స్పష్టం చేశారు.
Read Also : Murder : నో చెప్పిందని మహిళను చంపేసిన వైనం..