KTR Comments : ‘మ‌హాకూట‌మి’ కొత్త రూపం ఇదే?

తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా మంత్రి కేటీఆర్ ఎప్పుడూ అనాలోచింతంగా వ్యాఖ్య‌లు చేయ‌రు. ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కారమే వాళ్లు అడుగులు వేస్తుంటారు. ప్ర‌త్యర్థులు తేరుకునేలోపే లక్ష్యాన్ని చేరుకునే అప‌ర‌చాణ‌క్యులు తండ్రీకొడుకులు.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 01:10 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా మంత్రి కేటీఆర్ ఎప్పుడూ అనాలోచింతంగా వ్యాఖ్య‌లు చేయ‌రు. ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కారమే వాళ్లు అడుగులు వేస్తుంటారు. ప్ర‌త్యర్థులు తేరుకునేలోపే లక్ష్యాన్ని చేరుకునే అప‌ర‌చాణ‌క్యులు తండ్రీకొడుకులు. ఆ విష‌యం 2014, 2018 ఎన్నిక‌ల సంద‌ర్భంగా చూశాం. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి అప‌జ‌యాలు పాలైన పార్టీల గ‌త‌ చ‌రిత్ర‌ను కాద‌ని 2018లో ప్ర‌భుత్వాన్ని రెండోసారి టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఏ కార‌ణ‌మూ లేకుండా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. విప‌క్షాల చేస్తోన్న అవినీతి ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌ల మ‌ధ్య కు వెళ్లే లోపే 2018 ఎన్నిక‌ల‌ను ముగించారు. మూడోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ వేస్తోన్న ఎత్తుగ‌డ‌ల్లో భాగంగా క్రెడాయ్ స‌మావేశంలో ఏపీ వెనుక‌బాటుపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను తీసుకోవ‌చ్చు.

తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పాద‌యాత్ర చేస్తున్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగిసిన త‌రువాత విజ‌య‌మ్మ రంగంలోకి దిగే అవ‌కాశం ఉంది. పార్టీ పెట్టిన తొలి రోజుల్లో ష‌ర్మిల‌తోనే విజ‌య‌మ్మ ఉన్నారు. కుమార్తెను ఆశీర్వ‌దించాల‌ని వేదిక‌ల‌పై ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించారు. స్వ‌ర్గీయ వైఎస్ ఆర్ అభిమానులు, అనుచ‌రుల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నాన్ని నిర్వ‌హించారు. ఆ సంద‌ర్భంగా రెడ్డి సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు, కేసీఆర్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ష‌ర్మిల పాద‌యాత్ర చేస్తున్నారు. కేసీఆర్ గ‌డీల పాల‌న నుంచి రాజ‌న్నరాజ్యం వైపు ఆలోచించాల‌ని ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటున్నారు. ఇదంతా కేసీఆర్ కు వ్య‌తిరేకంగా న‌డుస్తోన్న వ్య‌వ‌హార‌మే.

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తోన్న ష‌ర్మిల‌పై ఒత్తిడి తీసుకురావ‌డానికి ఏపీ వెనుబాటుత‌నాన్ని వ్యూహాత్మ‌కంగానే మంత్రి కేటీఆర్ కామెంట్ చేశార‌ని తెలుస్తోంది. అంతేకాదు, రాబోవు రోజుల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మార‌డానికి అవ‌కాశం ఉండేలా ఆయ‌న వ్యాఖ్య‌ల్లోని ఆంతర్యం ఉంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ప్లీన‌రీ వేదిక‌గా జాతీయ పార్టీ ప్ర‌స్తావ‌న కేసీఆర్ తీసుకొచ్చారు. గ‌త ఏడాది జరిగిన ప్లీన‌రీలో ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీని పెడ‌తామ‌ని వెల్ల‌డించారు. విభ‌జ‌న వాదం నుంచి జాతీయ వాదానికి కేసీఆర్ మారారు. అందుకు త‌గిన విధంగా వ్యూహాలు ప‌న్నుతున్న త‌రుణంలో కేటీఆర్ ఏపీ వెనుక‌బాటుత‌నంపై వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు.

ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీతో కేటీఆర్ స‌న్నిహితంగా ఉంటున్నారు. ఎప్పుడూ లేనిది బీమ్లా నాయ‌క్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో కేటీఆర్ క‌నిపించారు. అంతేకాదు, ప‌వ‌న్ కల్యాణ్ క్రేజ్ ను, ఆయ‌న పార్టీ గురించి కూడా ఆ వేదిక‌పై ప్ర‌స్తావించారు. అంత‌కు ముందు బీజేపీని కాద‌ని హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీతో క‌లిసి జ‌న‌సేన ప‌నిచేసింది. పైగా తెలంగాణ బీజేపీ వేదిక‌పైకి జ‌న‌సేన రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌డంలేదు. ఆ రెండు పార్టీల‌కు తెలంగాణ కేంద్రంగా వైరం నెల‌కొంది. ఆ క్ర‌మంలో రాబోవు రోజుల్లో జ‌న‌సేన‌, టీఆర్ఎస్ పార్టీ కలిసి 2023 ఎన్నిక‌ల‌కు వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప‌వ‌న్ కు మ‌ధ్య రాజ‌కీయ వార్ జ‌రుగుతున్నప్పుడు బీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు కేటీఆర్ హాజ‌ర‌య్యారు. అంటే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా మంత్రి కేటీఆర్ అడుగులు వేస్తున్నార‌ని అనుకోకుండా ఉండ‌లేం.

జాతీయ పార్టీ లేదా ఏపీ వ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీని విస్త‌రింప చేసే ఆలోచ‌న కేసీఆర్‌, కేటీఆర్ చేస్తున్నారు. ఆ విష‌యాన్ని సూచాయ‌గా ప‌లు వేదిక‌ల‌పై ఇద్ద‌రూ సంకేతం ఇచ్చారు. ఇప్పుడున్న ఎంపీల సంఖ్య‌తో ఢిల్లీ రాజ‌కీయాన్ని కేసీఆర్ న‌డ‌ప‌డం సుల‌భం కాదు. అందుకే, ఎంపీల సంఖ్య పెర‌గాలంటే టీఆర్ఎస్ పార్టీని ముందుగా ఏపీకి విస్త‌రింప చేయాలి. అక్క‌డ గెలుపు దిశ‌గా అడుగులు వేయాలంటే ప్ర‌స్తుతం ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాలి. విపక్షాల‌తో కూట‌మిగా ఏర్ప‌డి ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎంతో కొంత టీఆర్ఎస్ పార్టీ అనుకూల ఫ‌లితాల‌ను సాధిస్తుంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే, 2024 ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన‌, టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఏపీలో ఉండే అవ‌కాశం లేక‌పోలేదు.

2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఉత్త‌ర భార‌త దేశం పెత్త‌నాన్ని జ‌న‌సేనాని వెలుగెత్తి చాటారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇంచుమించు అలాంటి వాయిస్ నే వినిపిస్తున్నారు. ఇద్ద‌రూ ఒకే పంథాలో వెళుతున్నారు. ప్ర‌స్తుతం బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్న జ‌న‌సేన పార్టీని ద‌గ్గ‌ర చేసుకోవాల‌ని టీఆర్ఎస్ భావిస్తుంద‌ని అంచ‌నా వేయొచ్చు. తెలంగాణ‌, ఏపీల్లో టీఆర్ఎస్, జ‌న‌సేన పొత్తు దిశ‌గా అడుగులు వేయ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. అదే జ‌రిగితే,తెలంగాణ‌లో మూడోసారి సీఎం కావ‌డం కేసీఆర్ కు ఈజీగా మార‌డంతో పాటు ఎపీలో ఎంపీల సంఖ్య కొన్నింటినైనా పొందొచ్చ‌ని టీఆర్ ఎస్ ఆలోచ‌న‌గా ఉంద‌ని తెలుస్తోంది.

అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా జ‌గన్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్‌, క‌విత విమ‌ర్శిస్తున్నారు. ఏపీ వెనుక‌బాటుత‌నంపై పలు మార్లు ఏడాదిన్న‌ర కాలం నుంచి అనేక వేదిక‌ల‌పై వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. క్రెడాయ్ మీటింగ్ లో ఏపీ వెనుక‌బాటుపై ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన వ్యాఖ్య‌లు కాద‌ని మంత్రి కేటీఆర్ చెబుతున్న‌ప్ప‌టికీ క‌ల్వ‌కుంట్ల కుటుంబం గురించి బాగా తెలిసిన వాళ్లు ఎవ‌రూ ఆయ‌న వివ‌ర‌ణ‌ను విశ్వసించ‌రు. భ‌విష్య‌త్ రాజ‌కీయాన్ని అంచ‌నా వేస్తూ ఇటీవ‌ల ఏపీ స‌ర్కార్ పై కామెంట్లు చేస్తున్నార‌ని భావించే వాళ్లు ఎక్కువ‌.

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉంది.ఇరు రాష్ట్రాల్లోనూ టీడీపీ, టీఆర్ఎస్, జ‌న‌సేన కూట‌మి క‌ట్టే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి క‌ల్వ‌కుంట్ల కుటుంబం నిద్ర‌లేకుండా చేస్తోంది. ష‌ర్మిల ఏ విధంగా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారో, అలాగే జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డానికి కేటీఆర్ ఏపీ రాజ‌కీయ రంగంలోకి దిగిన‌ప్ప‌టికీ ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఒకే వేదిక‌పైన కేసీఆర్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌నిపిస్తే 2023, 2024 ఎన్నిక‌ల్లో ఇరు రాష్ట్రాల్లో సంచ‌ల‌నాలు న‌మోదు కావ‌డం ఖాయ‌మ‌ని ఆయా పార్టీల సీనియ‌ర్లు భావిస్తున్నారు.