రాజ్యాంగాన్ని తిరగరాయంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల దుమారాన్ని మర్చిపోయేలా మంత్రి కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేశాడు. దళితుల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో నష్టనివారణ చర్యలకు పూనుకున్నాడు. కొత్త రాజ్యాంగం అవసరమనే ఎజెండాను సీఎం కేసీఆర్ ఫిక్స్ చేశాడు. కొత్త ఆలోచన, దిశగా రాజ్యాంగం నిర్మితం కావాలని అభిప్రాయపడ్డాడు. దీంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. అంతేకాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడంటూ కేసీఆర్ దిష్టిబొమ్మలను దళితులు తగులుబెడుతున్నారు. ఉవ్వెత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని చల్లబరచడానికన్నట్టు ఎన్టీఆర్ గార్డెన్ లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించాడు.తెలంగాణ వ్యాప్తంగా గురువారంనాడు భీం దీక్షలు కొనసాగుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ దీక్షలు చేస్తోంది. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకో వైపు దళిత సంఘాలు భీందీక్షలకు దిగడంతో పరిస్థితి సీరియస్ గా మారిందని టీఆర్ఎస్ గ్రహించింది. ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని అనుసరిస్తూ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.
ఎన్టీఆర్ గార్డెన్ రూపురేఖలు మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయింది. ఆ గార్డెన్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి సిద్ధం అవుతుంది. ఎన్టీఆర్ గార్డెన్స్‌లో త్వరలో 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కెటి రామారావు ప్రకటించాడు. ఖైరతాబాద్‌లోని ఇందిరా నగర్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని గురువారం ప్రారంభించిన ఆయన ఆ మేరకు ప్రకటన చేశాడు. హౌసింగ్ సైట్‌కు సమీపంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్‌లో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం త్వరలో రానుందని తెలిపాడు. విగ్రహంతో పాటు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని, ప్రభుత్వం రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించిందని ప్రకటించారు. కొల్లూరులో ప్రభుత్వం 15,640 డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించిందని, వీటిని వారం రోజుల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. మొత్తం మీద అంబేద్కర్ రూపంలో వస్తోన్న వ్యతిరేకతను గమనించిన కేటీఆర్ సరికొత్త ప్లాన్ వేశాడు. ఎన్టీఆర్ గార్డెన్ వర్సెస్ అంబేద్కర్ విగ్రహం అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చాడు కేటీఆర్. దీనితో రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చేసిన డ్యామేజి ఎంత వరకు కవర్ అవుతుందో..చూడాలి.