UP Elections 2022 : అఖిలేష్ ఆహ్వానం కోసం కేసీఆర్‌..

ఫ్రంట్ దిశ‌గా అడుగులు వేస్తోన్న తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడని తెలుస్తోంది. స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌పున ప్ర‌చారానికి శ్రీకారం చుట్టాల‌ని భావిస్తున్నాడ‌ని స‌మాచారం

  • Written By:
  • Publish Date - January 18, 2022 / 01:29 PM IST

ఫ్రంట్ దిశ‌గా అడుగులు వేస్తోన్న తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడని తెలుస్తోంది. స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌పున ప్ర‌చారానికి శ్రీకారం చుట్టాల‌ని భావిస్తున్నాడ‌ని స‌మాచారం. బీజేపీకి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా అడుగులు వేయాల‌ని ఉవిళ్లూరుతున్నాడు. కానీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ నుంచి ఎలాంటి ఆహ్వానం కేసీఆర్ కు ఇప్ప‌టి వ‌ర‌కు ల‌భించ‌లేదు. ఆ మేర‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాలు కూడా ధ్రువీక‌రించ‌లేదు.
సిద్ధాంత ప‌రంగా బీజేపీకి వ్య‌తిరేకంగా ఉండే పార్టీలు కేసీఆర్ ను విశ్వాసంలోకి తీసుకోలేక‌పోతున్నారు. ఏడేళ్లుగా కేంద్రంలోని మోడీ స‌ర్కార్ కు టీఆర్ఎస్ వ‌త్తాసు ప‌లుకుతూ వ‌చ్చింది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలోనూ పార్ల‌మెంట్ వేదిక‌గా పరోక్ష మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం చూశాం. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన రైతు ఉద్య‌మ‌నాయకుడు తికాయ‌త్ కూడా టీఆర్ఎస్ పై మండిప‌డ్డాడు. రైతు వ్యతిరేకిగా కేసీఆర్ ను అభివ‌ర్ణించాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ మ‌ద్ధ‌తు తీసుకుంటే..ప్ర‌స్తుతం ఉన్న ఇమేజ్ పోతుంద‌ని ఎస్పీ అంచ‌నా వేస్తుంద‌ట‌. అందుకే, ప్ర‌చారానికి కేసీఆర్ సిద్ధం అయిన‌ప్ప‌టికీ అఖిలేష్‌ ఆహ్వానం ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదని తెలుస్తోంది.

వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ఉత్త‌ర భార‌త‌దేశాన్ని అట్టుడికేలా చేశాయి. రైతులు ఏడాదిన్న‌ర‌పాటు చేసిన ఉద్య‌మం దెబ్బ‌కు మోడీ సైతం బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాడు. లేదంటే, ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, ఒక మెట్టుదిగిన మోడీ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను పార్ల‌మెంట్ వేదిక‌గా వెన‌క్కు తీసుకున్నాడు. మెరుగైన విధంగా స‌మ‌గ్ర చ‌ట్టాల‌ను మ‌రోసారి ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ప్ర‌క‌టించాడు. దీంతో తాత్కాలికంగా రైతులు చ‌ల్ల‌బ‌డిన‌ప్ప‌ట‌వికీ పూర్తిగా వ్య‌వ‌సాయ చ‌ట్టాల వేడి త‌గ్గ‌లేదు. రైతు సంఘాల నేత‌లు కూడా బీజేపీ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నారు. ఈ అంశం ఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు భావ‌న.
యూపీలో అధికారంలోకి రానున్న పార్టీగా ఎస్పీ ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా పాజిటివ్ సంకేతాల‌ను అందుకుంది. అందుకే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళితే ఎంతో కొంత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు ఉప‌యోగ‌పడుతుంద‌ని కేసీఆర్ వ్యూహం. ఫ్రంట్ దిశ‌గా ఆలోచిస్తోన్న కేసీఆర్ ప్ర‌త్యేక ఫ్లైట్ ద్వారా లాలూ కుటుంబాన్ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు పిలిపించుకున్నాడు. అలాగే, క‌మ్యూనిస్ట్ ల‌ను ఆయ‌నే ఆహ్వానించాడు. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ వ‌ద్ద‌కు మాత్రం కేసీఆర్ వెళ్లాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన భేటీలో తెలంగాణ రాష్ట్రంలోని జ‌య‌ల‌లిత ఆస్తుల‌పై ప్ర‌స్తావ‌న వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం జ‌రిగింది. దానికి ఎలాంటి ఖండ‌న కూడా టీఆర్ఎస్ ఇవ్వ‌లేదు.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ వ్యాప్తంగా జ‌రిగిన ఉద్య‌మంలో పెద్ద సంఖ్య‌లో రైతులు మ‌ర‌ణించారు. వాళ్లంద‌రూ ఉత్త‌ర భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు చెందిన వాళ్లు. ఇప్పుడు మ‌ర‌ణించిన రైతుల కుటుంబాల‌ను పరామ‌ర్శించాల‌ని కేసీఆర్ భావిస్తున్నాడ‌ని తెలిసింది. అంతేకాదు, ప్ర‌తి కుటుంబానికి రూ. 3ల‌క్ష‌ల ప‌రిహారం అంద‌చేయ‌డం ద్వారా దేశ వ్యాప్తంగా ఓదార్పు యాత్ర త‌ర‌హాలో ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల వినికిడి. ఇలా..ఏదో ఒక రూపంలో ఉత్త‌ర‌భార‌త దేశంలోని రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్నాడు. ఆ క్ర‌మంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లాల‌ని ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో..చూద్దాం.!