KCR : జాతీయ‌వాదంపై BRS యూట‌ర్న్! కేసీఆర్ కు హ్యాండిచ్చిన స్టాలిన్ టీమ్‌!!

తెలంగాణ సీఎం(KCR) జాతీయ గేమ్ ఫెయిల్ అయింది. మ‌ళ్లీ స‌మైక్య పాల‌న గురించి మాట్లాడుతున్నారు.

  • Written By:
  • Updated On - March 3, 2023 / 04:13 PM IST

తెలంగాణ సీఎం(KCR) జాతీయ గేమ్ ఫెయిల్ అయింది. ఆయ‌న మ‌ళ్లీ స‌మైక్య పాల‌న(Telangana) గురించి మాట్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన దేవాల‌య ప్రారంభానికి హాజ‌రైన కేసీఆర్ స‌మైక్యంగా ఉన్న‌ప్పుడు తెలంగాణ‌కు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేశారు. అంటే, ఆయ‌న మ‌ళ్లీ సెంటిమెంట్ ద్వారా మూడోసారి సీఎం కావాల‌ని స్కెచ్ మొద‌లు పెట్టారు. జాతీయ వాదాన్ని అట‌కెక్కించినట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ల‌కు ఆహ్వానం లేదు. బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీల నేత‌లు ఆ వేడుక‌ల్లో క‌నిపించారు. ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు, కాంగ్రెస్, ఎన్సీపీ, తృణ‌మూల్, ఎస్పీ త‌దిత‌ర పార్టీల ప్ర‌తినిధులు, అధిప‌తులు హాజ‌ర‌య్యారు. ఆ వేడుక‌ల‌ను గ‌మ‌నిస్తే కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రూ బీజేపీ తానులోని ముక్కలుగా భావించిన‌ట్టు క‌నిపిస్తోంది.

తెలంగాణ సీఎం జాతీయ గేమ్ ఫెయిల్ (KCR)

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ 2018 ఎన్నిక‌ల‌కు ముందుగా కేసీఆర్(KCR) ప‌లు రాష్ట్రాల‌ను సందర్శించారు. ఆయా రాష్ట్రాల్లోని దేవాల‌యాలకు వెళ్లారు. అక్క‌డి నేత‌లతో భేటీ అయ్యారు. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ను రెండుసార్లు క‌లిశారు. డీఎంకే పార్టీ స్థాప‌న త‌దిత‌నంత‌ర ప‌రిణామాల‌ను న‌మూనాగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి మ‌నుగడ సుదీర్ఘ‌కాలం ఉండేలా శిక్ష‌ణ తీసుకోవాల‌ని భావించారు. కాంగ్రేసేత‌ర కూట‌మిలోకి స్టాలిన్ ను తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు. కాంగ్రెస్ తో కూట‌మిలోనే కేసీఆర్ ఉండాల‌ని స్టాలిన్ భావించారు. అలాగే, మ‌మ‌త‌, అఖిలేష్ యాద‌వ్ త‌దిత‌ర బ‌ల‌మైన లీడ‌ర్ల‌తో కేసీఆర్ ఇటీవ‌ల కూడా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి అంద‌ర్నీ ఆహ్వానించారు. కానీ, మాజీ సీఎం కుమార‌స్వామి, జార్ఖండ్ సీఎం హేమంత్ సో రెన్ మిన‌హా ఎవ‌రూ పెద్ద‌గా కేసీఆర్ ఆహ్వానానికి పాజిటివ్ గా స్పందించలేదు. కానీ, స్టాలిన్ 70వ బ‌ర్త్ డేకు సంద‌ర్భంగా ప‌లు పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ లీడ‌ర్లు హాజ‌రు కావ‌డం కేసీఆర్ జాతీయ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన‌ప‌రిచేలా క‌నిపిస్తోంది.

Also Read : CM KCR: కేసీఆర్ దూకుడు.. దేశవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు!

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్(KCR), జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రికీ స్టాలిన్ ఆహ్వానం ఇవ్వ‌లేదు. అంటే, వాళ్లిద్ద‌రూ బీజేపీలో తానులో ముక్క‌లుగా ఆయ‌న భావిస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. తొలి నుంచి కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సామాన్యుల‌కు అర్థంకాని విధంగా తెర‌వెనుక గేమాడుతున్నారు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేసిన క్ర‌మంలో అంద‌ర్నీ ఆహ్వానించిన కేసీఆర్ ప‌క్క‌నే ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మాత్రం దూరంగా పెట్టారు. ఆ త‌రువాత ఏపీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ ఇస్తుంద‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్, బీజేపీయేత‌ర కూట‌మి అంటూ దేశం మొత్తం తిరుగుతోన్న కేసీఆర్ ప‌క్క‌న ఉన్న సోద‌రుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మాత్రం ట‌చ్ చేయ‌డంలేదు. వాళ్లిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం ఎలాంటి రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసుకోరు. అంటే, తెర‌వెనుక వాళ్లిద్ద‌రి గేమ్ ఏమిటో ఒక‌మాత్ర‌న అర్థం కాదు. కానీ, స్టాలిన్ లాంటి లీడ‌ర్ల‌కు మాత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల గేమ్ బోధ‌ప‌డింది. అందుకే, వాళ్లిద్ద‌ర్నీ బ‌ర్త్ డే వేడుక‌ల‌కు దూరంగా పెట్టారు.

 సీఎంలు కేసీఆర్ , జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్టాలిన్ ఆహ్వానం ఇవ్వ‌లేదు

వేడుక‌ల్లో పాల్గొన్న జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశ ప్రధాని ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. దేశ ఐక్యతను కాపాడేందుకు స్టాలిన్ కృషి చేస్తున్నారని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఎంతో పాటుపడుతున్నారని కితాబునిచ్చారు. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, దాని కోసం స్టాలిన్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ తో కూడిన కూట‌మి మాత్ర‌మే బీజేపీకి ప్ర‌త్యామ్నాయ‌మ‌ని ఆ వేదిక మీద ఏఐసీసీ చీఫ్ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే వెల్ల‌డించారు. అంటే, ఆ వేదిక మీద ఉన్న పార్టీల‌న్నీ దాదాపుగా ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు అనుగుణంగా ఉన్న వాళ్లే. మూడో కూట‌మి ద్వారా బీజేపీ లాభ‌ప‌డుతుంద‌ని ఇటీవ‌ల ప్లీన‌రీ కూడా కాంగ్రెస్ అభిప్రాయ‌ప‌డింది. అంటే, కాంగ్రెస్, బీజేపీ ప్ర‌త్యామ్నాయం అంటూ కేసీఆర్ చేస్తోన్న జాతీయ నినాదానికి వ్య‌తిరేకంగా స్టాలిన్ బ‌ర్త్ డే వేడుక‌ల వేదిక గ‌ళం విప్పింద‌ని అర్థ‌మ‌వుతోంది. అంటే, బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా క‌నుమ‌రుగు అవుతోన్న స‌మ‌యంలో స‌మైక్య పాల‌న‌లో(Telangana) న‌ష్ట‌పోయామ‌ని మ‌ళ్లీ ప్ర‌త్యేక‌వాదాన్ని నిజామాబాద్ వేదిక‌గా కేసీఆర్ వినిపించారు. అంటే, దాదాపుగా యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది.

Also Read : KCR and Jagan: ఎన్నికల వేళ మళ్లీ అన్నదమ్ముల నీళ్ళ పంచాయితీ

ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి పార్ల‌మెంట్ వేదిక‌గా ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు లోక్ సభ సచివాలయం గుర్తింపును ఇవ్వలేదు. బీఆర్ఎస్ తరపున బీఏసీ సభ్యుడిగా ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. కేవలం ఒక ఆహ్వానితుడిగానే లోక్ సభ సచివాలయం ఆహ్వానించింది. వాస్తవానికి ఆరుగురి కంటే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. బీఆర్ఎస్ కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ లోక్ సభ సచివాలయం ఆ పార్టీకి గుర్తింపును తొలగించింది. ఇకపై బీఏసీలో బీఆర్ఎస్ కేవలం ఆహ్వానిత పార్టీగా మాత్రమే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇదో పెద్ద మైన‌స్.