TRS, UPA : యూపీఏతో టీఆర్ఎస్! కాంగ్రెస్ తో పొత్తు ఎత్తు!!

`ఎప్పుడు వ‌చ్చింది కాద‌మ్మా, బుల్లెట్ దిగిందా? లేదా? అనేది ముఖ్యం.` ఇదో తెలుగు సినిమాలోని డైలాగ్‌. ఇదే డైలాగును కొంచెం అటూఇటూగా కేసీఆర్ వ్యూహాల‌కు వ‌ర్తింప చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీతో క‌లిసి వెళ్ల‌డానికి స‌రైన స‌మ‌యంలో స‌రైన ప్లేస్ లో కేసీఆర్ ముందడుగు వేశారు.

  • Written By:
  • Updated On - July 22, 2022 / 04:51 PM IST

`ఎప్పుడు వ‌చ్చింది కాద‌మ్మా, బుల్లెట్ దిగిందా? లేదా? అనేది ముఖ్యం.` ఇదో తెలుగు సినిమాలోని డైలాగ్‌. ఇదే డైలాగును కొంచెం అటూఇటూగా కేసీఆర్ వ్యూహాల‌కు వ‌ర్తింప చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీతో క‌లిసి వెళ్ల‌డానికి స‌రైన స‌మ‌యంలో స‌రైన ప్లేస్ లో కేసీఆర్ ముందడుగు వేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుకు క‌ళ్లెం వేయడానికి హ‌స్తిన కేంద్రంగా చ‌క్రం తిప్పారు. ఫ‌లితంగా రాబోవు రోజుల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ భాయ్ భాయ్ కానున్నాయ‌ని ఢిల్లీ లోని బ‌ల‌మైన టాక్‌.

మూడుసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ వేస్తోన్న ఎత్తుగ‌డ‌లు గ‌మ‌నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తును సోనియా వ‌ద్ద ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌స్తావించారు. అంత‌కంటే ముందే, కొంద‌రు కాంగ్రెస్ తెలంగాణ లీడ‌ర్లు పొత్తు గురించి ప్ర‌య‌త్నాలు చేశార‌ని సర్వ‌త్రా వినిపించిన మాట‌. ఆ ప్ర‌యత్నాలు చేసిన సీనియ‌ర్ల‌కు కోవ‌ర్టులు అనే ముద్రను రేవంత్ అభిమానులు తగిలించారు. పైగా హ‌స్తిన పెద్ద‌లు కూడా అయిష్టంగా ఉండ‌డంతో సైలెంట్ అయ్యారు. అయితే, పీకే ఇటీవ‌ల పొత్తు గురించి ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డంతో పీసీసీ చీఫ్ రేవంత్ కు గొంత‌లో వెల‌క్కాయ‌ప‌డిన‌ట్టు అయింది. వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ సంద‌ర్భంగా రాహుల్ పొత్తుల గురించి మాట్లాడారు. మోస‌గాడు కేసీఆర్‌తోగానీ, ఎంఐఎంతోగానీ పొత్తు ప్ర‌స‌క్తే ఉండ‌ద‌ని బ‌హిరంగ స‌భ‌లోనే ప్ర‌క‌టించారు. ఆనాటి నుంచి గుమ్మ‌నంగా పొత్తు వ్య‌వ‌హారం ఉండిపోయింది.


మూడు ప్ర‌ధాన ఘ‌ట్టాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ క‌లిసి ఇటీవ‌ల ప‌నిచేశాయి. తాజాగా బుధ‌వారంనాడు సోనియాను ఈడీ విచార‌ణ‌కు పిలిచిన సంద‌ర్భంగా పార్ల‌మెంట్ వేదిక‌గా ఆ రెండు పార్టీలు క‌లిసి నిర‌సించాయి. అంతేకాదు, ఈడీ దాడులు, సోనియాపై విచార‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ యూపీఏ భాగ‌స్వామ్య ప‌క్షాలు రాసిన లేఖ‌పై టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు సంత‌కం చేశారు. అంటే, యూపీఏలో భాగ‌స్వామిగా టీఆర్ఎస్ పార్టీ మారింద‌న‌డానికి ఇంత కంటే నిద‌ర్శ‌నం మ‌రొక‌టి ఉండ‌దు. పైగా ఈడీ, సోనియా విచార‌ణ‌కు వ్య‌తిరేకంగా విప‌క్షాల‌తో కాంగ్రెస్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఏర్పాటు చేసిన విప‌క్షాల స‌మావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు నామా, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత కేశ‌వ‌రావు హాజ‌రు కావ‌డం విశేషం.

విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తు ప‌లికిన పార్టీల్లో టీఆర్ఎస్ ప్ర‌ముఖంగా ఉంది. అంతేకాదు, సిన్హాను ర్యాలీతో ఆహ్వానించ‌డం తో పాటు బ‌హిరంగ స‌భ ద్వారా ఆయ‌న‌కు కేసీఆర్ మ‌ద్ధ‌తు ప‌లికారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత హ‌నుమంత‌రావు ఢిల్లీ నుంచి వ‌చ్చిన సంకేతాల మేర‌కు సిన్హాను క‌లిశార‌ని తెలుస్తోంది. ఆ విష‌యంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించిన‌ప్ప‌టికీ ఏఐసీసీ పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకోలేదు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తో క‌లిసి ప‌నిచేయ‌డానికే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. ఏదో ఒక సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ పార్టీ కూడా యూపీఏ ప‌క్షాల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ద‌ప‌డుతోంది. ప్ర‌ధాని మోడీని ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసిన కేసీఆర్ ఇటీవ‌ల బీజేపీ విధానాలు, మోడీ వ్య‌వ‌హార‌శైలిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇటీవ‌ల రాహుల్ గాంధీ పుట్ట‌క గురించి కొంద‌రు బీజేపీ నేత‌లు అనుచితంగా మాట్లాడారు. ఆ సంద‌ర్భంగా బీజేపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. గ‌త నాలుగు నెల‌లుగా కాంగ్రెస్ పార్టీని ప‌ల్లెత్తు మాట కేసీఆర్ నుంచి రాలేదు. పీసీసీ అధ్య‌క్షుడుగా ఉన్న రేవంత్ పేరు ఇప్ప‌టి వ‌ర‌కు ఎత్త‌లేదు. తాజాగా మాత్రం ధ‌ర‌ణీ పోర్ట‌ల్ ను ర‌ద్దు చేస్తాన‌ని చెబుతోన్న వాళ్లు ఎక్క‌డ ఉంటే ఆ పార్టీ నాశ‌న‌మే అంటూ రేవంత్ పేరు ఎత్తుకుండా సెంటిమెంట్ ను కేసీఆర్ వినిపించారు. ఇదంతా చూస్తుంటే, యూపీఏలో భాగస్వామిగా మార‌డానికి కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు చాలా వేగంగా ప‌డుతున్నాయ‌ని అర్థం అవుతోంది. అదే జ‌రిగితే, రేవంత్ రెడ్డి ఆశిస్తోన్న సీఎం ప‌ద‌వి శాశ్వ‌తంగా గోవిందా! అంటూ ఇరు పార్టీల నేత‌ల్లోని సీరియ‌స్ టాక్‌. స‌రైన స‌మ‌యంలో స‌రైన వేదిక‌పై యూపీఏ దిశ‌గా అడుగులు వేసిన కేసీఆర్ వ్యూహం తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌కం కానుంది.