Site icon HashtagU Telugu

KCR Atlas Cycle Story : సిద్దిపేట సభలో కేసీఆర్ చెప్పిన సైకిల్ కథ .. మాములుగా లేదుగా

KCR Atlas Cycle Story

KCR Atlas Cycle Story

కేసీఆర్ (KCR) ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. తన మాటలతో అవతలి వారిని యిట్టె మాయ చేస్తుంటారు. పదునైన డైలాగ్స్ (KCR Dialogues) మాత్రమే కాదు ఆకట్టుకునే కథలు , తన జీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఎంతో అందంగా , అర్థమై రీతిలో చెపుతుంటారు. పలు సభ వేదికలపై తన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటారు. తాజాగా సిద్దిపేట సభ (KCR Siddipet Public Meeting )లో కూడా అలాగే తన జీవితంలో జరిగిన సైకిల్ కథను చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం కేసీఆర్ ఎన్నికల ప్రచారం (KCR Election Campaign)లో బిజీ గా ఉన్నారు. ప్రతి రోజు పలు జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభ (KCR Praja Ashirvada Sabha)లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు సిరిసిల్ల , సిద్దిపేట (Siddipet ) లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. సిద్దిపేట నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..సైకిల్ కథ ను చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో మిట్టపల్లిలో కార్యక్రమం ఉంటే.. వెళ్లేందుకు కారెక్కబోతున్నాను. అదే సమయంలో రామంచ గ్రామానికి చెందిన ఓ ఆడకూతురు పరుగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ల మీద పడింది. “ఏమైందమ్మా.. ఏం కష్టమొచ్చింది” అని ఆమెను అడిగితే.. బిడ్డ పెండ్లి ఆగిపోయేలా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది.

ఎందుకని అడిగితే అసలు ముచ్చట చెప్పింది. “బిడ్డ పెండ్లికి అల్లునికి ఓ అట్లాస్ సైకిల్ (Atlas Cycle ) పెడ్తానని ఒప్పుకున్నా.. అన్ని కుదినయ్ కానీ అట్లాస్ సైకిల్ కొనిచ్చేందుకు మాత్రం పైసల్ కూడలేదు. రేపే పెండ్లి..” అని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది. వెంటనే అట్లాస్ సైకిల్‌కు ఎంతవుతుందని నా గన్ మెన్లను అడిగితే.. 1900 రూపాయలు ఉంటదని చెప్పిండ్రు. జేబుల నుంచి 1900 తీసి ఆమె చేతుల పెట్టిన. ఏం బాధపడకు.. “సైకిల్ తీసుకొచ్చి పెట్టి.. బిడ్డ పెండ్లి మంచిగా చెయ్యి” అని చెప్పిన. ఆమె వెంట ఉన్న తన బిడ్డను చూసి.. “ఏమమ్మా.. ఆ బుద్ది లేనోడు ఎవడు.. బంగారం లెక్క ఉన్న నీ బిడ్డను చేసుకుంటుండా.. సైకిల్‌‌ను చేసుకుంటుండా..” అని అడిగితే… నా ప్రశ్న విన్న వెంటనే ఆమె “అగో నా అల్లుడు కూడా వచ్చిండు సార్”.. అంటూ చెట్టు కింద ఉన్న పిలగాన్ని చూపెట్టింది.

అయితే.. ఆ పిలగాన్ని ఇటురావయా.. అని పిలిస్తే వచ్చిండు. “ఏమిరా నీకు బద్ది లేదా.. గింత మంచిగా బంగారం అసొంటి పిల్లను ఇస్తుంటే.. అమ్మాయిని చేసుకుంటవా.. సైకిల్‌ను పెండ్లి చేసుకుంటున్నావా” అని అడిగిన. “సార్ నా యిమానంగా సార్.. నాకు చేసుకోవాలనే ఉంది కానీ మా అయ్య తిడుతుండు సార్” అన్నడు. “సరే అయితాయే కానీ.. ఇగ సంతోషంగా పోయి అట్లాస్ సైకిల్ కొనియ్ పో” అని ఆమెకు చెప్పి మిట్టపల్లి కార్యక్రమానికి వెళ్ళా..కార్యక్రమం ముగిసిన తర్వాత మూడు గంటల ప్రాంతంలో మళ్లీ తిరిగి వస్తున్నాం. అప్పటికే ఆమె వెళ్లిపోయి ఉంటది అనుకున్నా. కానీ ఆమె చేతులో పసుపు కుంకుమ కొబ్బరి కాయతో సిద్ధంగా ఉంది. “ఏమమ్మా ఇంకా పోలేదా” అని అడిగితే.. లేదు సార్.. “ఈ సైకిల్‌కు నువ్వే కొబ్బరికాయ కొట్టాలే.. నీ చెయ్యి మంచిది..” అని అడిగింది.

We’re now on WhatsApp. Click to Join.

నేను వచ్చి కొబ్బరి కాయ కొట్టిన. అప్పుడు సీన్ ఎంత అందంగా ఉందంటే.. కొత్త సైకిల్‌ను అల్లుడు తొక్కుతుంటే.. ముందు పెండ్లి పిల్ల కూసుంది.. వెనుకు అత్త కూసుంది. ఒకే సైకిల్ మీద ముగ్గురు పోతుంటే.. నాయకులంతా ఆనందంతో చప్పట్లు కొట్టసాగిండ్రు. అయితే.. ఈ ఆసక్తికరమైన సంఘటన తనలో ఓ ఆలోచనను రేకెత్తించిందని చెప్పారు కేసీఆర్. తన కాళ్లపై పడిన ఆడబిడ్డ ఓ దళితురాలని.. ఆమెను అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందని ఆలోచించానని తెలిపారు. ఆ ఒక్క ఆడబిడ్డే కాదు.. దళితులందరికీ ఓ ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక స్వావలంభన కల్పించాలని సంకల్పించి.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కథ కేసీఆర్ చెపుతుంటే సభలో అంత ఎంతో శ్రద్దగా వినసాగారు.

Read Also : Leo Movie : తెలుగులో లియో సినిమా వాయిదా.. కోర్టులో కేసు.. స్పందించిన తెలుగు డిస్ట్రిబ్యూటర్..