Site icon HashtagU Telugu

Early Elections in AP & TS : ఒకేసారి ఎన్నిక‌లకు..?

Jagan-KCR

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు చెప్పిన `ముంద‌స్తు` మాట నిజ‌మ‌య్యేలా ఉంది. ఆ దిశ‌గా వైసీపీ కీల‌క నేత సాయిరెడ్డి కూడా ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఒక వేళ ముంద‌స్తు వ‌స్తే ఈసారి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఉండ‌దంటూ సాయిరెడ్డి సెటైర్ వేశాడు. కానీ, ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను మాత్రం ఆయ‌న ఖండించ‌లేదు. దీంతో చంద్ర‌బాబు మ‌హిళాదినోత్స‌వం రోజు చెప్పిన మాట‌లకు బ‌లం చేకూరుతోంది.వాస్త‌వంగా జ‌గ‌న్‌, కేసీఆర్ స‌న్నిహితంగా ఉంటున్నారు. స‌హ‌జ స్నేహితులుగా మెలుగుతున్నారు. అప్పుడప్పుడు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఇద్ద‌రూ స‌న్నాయినొక్కులు నొక్కుతున్నారు. వాటిని గ‌మ‌నించిన వాళ్లు ఇద్ద‌రి మ‌ధ్యా బెడిసింద‌ని భావిస్తున్నారు. కానీ, తెలుగు రాష్ట్రాల సీఎంల మ‌ధ్య స‌ఖ్య‌త ఉందనేది స‌త్యం. అందుకే, కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాడు. ఏపీలోని వైసీపీ ఎంపీల మ‌ద్ధ‌తు కూడా ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నాడ‌ట‌. లేదంటే, కేవ‌లం 9 మంది ఎంపీలు ఉన్న కేసీఆర్ ఢిల్లీ పీఠంపై కన్నేయడం హాస్యాస్ప‌ద‌మే అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌పై ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలు చేస్తున్నారు. ఇద్ద‌రు సీఎంల‌పై వ్య‌తిరేక‌త ఉంద‌ని స‌ర్వేల సారాంశం. ఎంత మోతాదులో వ్య‌తిరేక‌త ఉందో కూడా స్ప‌ష్టం చేశాడ‌ట‌. దానికి విరుగుడుగా ఎలాంటి రాజ‌కీయాలు చేయాలో..పీకే ఇప్ప‌టికే తెలియ‌చేశాడ‌ని ఆ పార్టీల్లోని టాక్‌. ఆంధ్రా రూపంలో సెంటిమెంట్ ను బాగా రాజేస్తేనే కేసీఆర్ మ‌ళ్లీ మూడోసారి సీఎం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశాడ‌ట‌. ఒక వేళ అదే జ‌రిగితే, తెలంగాణ‌లోని ఏపీ ఓట‌ర్లు టీఆర్ఎస్ కు ఈసారి ఓటు వేసే అవ‌కాశంలేదు. అందుకే, రెండు రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తే ఆ బెడ‌ద నుంచి కేసీఆర్ సేఫ్ అవుతాడు.తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 ల‌క్ష‌ల మంది సెటిల‌ర్ల ఓట్లు ఉన్నాయ‌ని అంచ‌నా. తెలంగాణ వ్యాప్తంగా 60 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో సెటిల‌ర్ల ప్రాబ‌ల్యం ఉంటుంది. ప్ర‌త్యేకించి హైద‌రాబాద్, రంగారెడ్డి, న‌ల్గొండ‌, ఖ‌మ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాలోని కొంత భాగం సెటిల‌ర్ల ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగితే, సెటిల‌ర్లు ఎక్కువ మంది ఏపీకి వెళ‌తారు. ఇప్ప‌టికే తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా ఏపీపై సెటైర్లు వేస్తోన్న కేసీఆర్ వాల‌కాన్ని సెటిల‌ర్లు గ‌మ‌నిస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా ఓటు చేసే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని పీకే స‌ర్వే సారాంశం. అందుకే, ఒక ఏడాది ముందుకు జ‌గ‌న్ ను ఎన్నిక‌ల‌కు తీసుకొస్తే సెటిల‌ర్ల బెడ‌ద నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని కేసీఆర్ యోచ‌న‌ట‌. ఆ లోపు సెంటిమెంట్ ను మ‌రోసారి పూర్తి స్థాయిలో రేప‌డం ద్వారా మూడోసారి సీఎం కావాల‌ని స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కార్ మీద ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది. ఆ విష‌యాన్ని పీకే స‌ర్వేల ద్వారా తెలుసుకున్న జ‌గ‌న్ ముంద‌స్తు వైపు ఆలోచిస్తున్నాడ‌ని టాక్‌. 2024వ‌ర‌కు ఉంటే, మ‌రింత వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని పీకే ఇచ్చిన స‌ర్వే స‌ల‌హాగా చెబుతున్నారు. ఒక వైపు కేసీఆర్ ఇంకో వైపు జ‌గ‌న్ గెలుపును కోరుకుంటోన్న పీకే మ‌ధ్యే మార్గంగా జ‌గ‌న్ ను ముందస్తుకు తీసుకొచ్చే ప్లాన్ చేశార‌ని వినికిడి. అదే, జ‌రిగితే, సెటిల‌ర్లు సుమారు 15 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఏపీకి వెళ్లే అవ‌కాశం ఉంది. వాళ్ల‌లో ఎక్కువ మంది జ‌గ‌న్ వైపు ఉన్నార‌ని అంచ‌నా. ఇలాంటి ఈక్వేష‌న్ల న‌డుమ ముంద‌స్తు ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌హిళాదినోత్స‌వ రోజున సూచాయ‌గా వెల్ల‌డించాడు. చాలా కాలంగా ఆయ‌న ముంద‌స్తు గురించి చెబుతున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా వైసీపీ ప‌ట్టించుకోలేదు. కానీ, ఈసారి మాత్రం ఆయ‌న స్టేట్ మెంట్ కు కొన‌సాగింపుగా అన్న‌ట్టు..ముంద‌స్తు వ‌స్తే ప్ర‌తిప‌క్ష హోదాకు మూడుతుంద‌ని సాయిరెడ్డి సెటైర్ వేయ‌డం గ‌మ‌నార్హం.