Prashant and KCR: కేసీఆర్, ప్రశాంత్ కిషోర్.. ఒకే లక్ష్యంతో వ్యూహాత్మకంగా కలిసి అడుగులు వేస్తున్నారా?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆయన పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ లు ఆమధ్య ప్రగతి భవన్ లో రెండు రోజుల పాటు సమావేశమయ్యారు.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 07:10 PM IST

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆయన పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ లు ఆమధ్య ప్రగతి భవన్ లో రెండు రోజుల పాటు సమావేశమయ్యారు. అప్పుడే వారి మధ్య ఓ క్లారిటీ వచ్చిందా? రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడించడంతోపాటు జాతీయస్థాయిలో మరో అజెండా కూడా సిద్ధం చేసుకున్నారా? ఎందుకంటే ఇద్దరూ చెబుతున్న మాటలు.. వేస్తున్న అడుగులు.. భవిష్యత్ ప్రణాళికలు అన్నీ ఒకేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ లు గంటల తరబడి మాట్లాడుకున్నారు. అప్పుడే వారిద్దరూ ఓ అవగాహనకు వచ్చారా? జాతీయస్థాయిలో రాజకీయాలపరంగా ఏ స్టాండ్ తీసుకోవాలి.. ఎలా వ్యవహరించాలి అన్నదానిపై ముందే స్కెచ్ రెడీ అయ్యిందని.. దానినే ప్లీనరీలో కేసీఆర్ చెప్పారంటున్నారు. ఇటు పీకే కూడా.. అప్పటివరకు కాంగ్రెస్ లో చేరుతానంటూనే.. చివరకు.. తాను హస్తం తీర్థం పుచ్చుకోనని చెప్పేశారు.

రాజకీయాల్లోకి వచ్చి జన్ సురాజ్ ద్వారా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటానన్నారు ప్రశాంత్ కిషోర్. ఆయన చేసిన ట్వీట్ ను బట్టి పార్టీ పెడతారని ముందు వార్తలు వచ్చినా.. తరువాత ఆయనే క్లారిటీ ఇచ్చారు. పార్టీ పెట్టబోనని.. కానీ బీహార్ లో పాదయాత్ర చేస్తానని తేల్చేశారు. దీంతో ప్రగతి భవన్ లో కేసీఆర్ తో మంతనాల తరువాత ఈ మాటలు చెప్పేసరికీ.. ఇదంతా ముందే ప్రిపేర్ అయిన స్కెచ్చా.. దానినే పీకే అమలు చేస్తున్నారా అన్న టాక్ మొదలైంది.

బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఇప్పటివి కావు. ఈమధ్యవరకు ఆయన అడుగులు అలాగే కనిపించాయి. అందుకే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలతో ఆయన భేటీ అవుతున్నప్పుడు.. మరో ఫ్రంట్ ఖాయం అన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఫ్రంటూ లేదు, టెంటూ లేదని గులాబీ బాస్ చెప్పడంతో ఫ్రంట్ కి ఎండ్ కార్డ్ పడింది.

కాంగ్రెస్, బీజేపీలకు తాను వ్యతిరేకం కాదని.. దేశ ప్రజలకు ఏం కావాలో దానినే అజెండాగా పెట్టి ముందుకు వెళతామన్నారు కేసీఆర్. భారత రాష్ట్ర సమితి పేరుతోపాటు పార్టీ పెట్టాలని.. దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని అడుగుతున్నారన్నారు. దీంతో ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని అర్థమవుతోంది. ఇక్కడ తేడా ఏమిటంటే.. కేసీఆర్ పాదయాత్ర ఊసెత్తలేదు. పీకే మాత్రం ఆ పనిని చేస్తానన్నారు.

ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి జర్నీని స్టార్ట్ చేస్తే.. కేసీఆర్ హైదరాబాద్ నుంచి పోరాటం మొదలుపెడతారు. జాతీయ రాజకీయాల్లో మార్పు హైదరాబాద్ నుంచి మొదలైతే మంచిదే కదా అని కేసీఆర్ అన్నప్పుడే అందరికీ క్లారిటీ ఇచ్చినట్టయ్యింది. వచ్చే ఎన్నికలకుముందు లేదా ఆ తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే పూర్తిగా ఫోకస్ పెడతారని అర్థమైంది.

దేశంలో ప్రజలకు ఏం కావాలో వారినే అడిగి తెలుసుకుంటామని కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ లు చెప్పారు. దీనిని బట్టి ఈ ఇద్దరి అజెండాలు ఒక్కటేనా.. లేకపోతే వేరే జెండా కిందకు వెళతాయా.. లేదా అన్నది వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది.