CM KCR: కేసీఆర్ స‌ర్కార్ కు `ఢిల్లీ ఎక్సైజ్` కిక్‌!

ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ లింకులు తెలంగాణ‌కు అంటుకున్నాయి. ఆ మేర‌కు బీజేపీ ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

  • Written By:
  • Updated On - August 20, 2022 / 11:10 AM IST

ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ లింకులు తెలంగాణ‌కు అంటుకున్నాయి. ఆ మేర‌కు బీజేపీ ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. అందుకు సంబంధించిన క్లూ పాయింట్ల‌ను తెలియ‌చేస్తూ చేసిన ట్వీట్ టీఆర్ఎస్ పార్టీలో గుబులు రేపుతోంది. ఒక వైపు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సంబంధం ఉన్న కంపెనీల‌పై ఐటీ దాడులు నాలుగు రోజులుగా జ‌రుగుతున్నాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియా నివాసంలో జ‌రుగుతోన్న సీబీఐ దాడుల లింకు తెలంగాణ‌లో త‌గ‌ల‌డం క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల లీడ‌ర్లు భావిస్తున్నారు. కొత్త ఎక్సైజ్ పాల‌సీని ఢిల్లీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకొచ్చింది. ఆ పాల‌సీ రూప‌క‌ల్ప‌న అంతా తెలంగాణ కు చెందిన ప్రైవేటు వ్య‌క్తుల‌ని బీజేపీ అనుమానిస్తోంది. డీల్ మొత్తం తెలంగాణ అడ్డాగా జ‌రిగింద‌ని వ‌ర్మ‌ ట్వీట్ చేయ‌డం దుమారం రేపుతోంది.

డీల్ సెట్ చేయడానికి తెలంగాణకు చెందిన వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లను మనీశ్ సిసోడియా సందర్శించాని బీజేపీ లీడ‌ర్లు చెబుతున్నారు. ఇందులో 10-15 మంది ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ వ్యక్తులతో పాటు సిసోడియా ఉన్నారని వర్మ ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి సిసోడియా నివాసంలో ప్రస్తుతం సీబీఐ సోదాలు చేస్తోంది. సిసోడియాతో పాటు మరో ముగ్గురు ప్రజా ప్రతినిధుల పేర్లను ఎఫ్ఐ ఆర్ లో చేర్చింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగిస్తోన్న సీబీఐ దాడులు తెలంగాణ వైపు మ‌ళ్లింది. ఆ దాడుల‌ను వ్య‌తిరేకిస్తూ మిస్డ్ కాల్ ఇవ్వాల‌ని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఆయ‌న సీబీఐ త‌నిఖీల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని చేప‌ట్టారు. ఢిల్లీ ప్ర‌భుత్వం ఎక్సైజ్ పాల‌సీ వెనుక ఉన్న తెలంగాణ‌కు చెందిని 15 మంది ప్రైవేటు వ్య‌క్తుల గురించి సీబీఐ ఆరా తీస్తోంది. అంతేకాదు, ప్ర‌భుత్వ ప‌రంగానూ కొంద‌రు హాజ‌రు అయ్యార‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌కు అనుగుణంగా ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. మొత్తం మీద ఢిల్లీ స్కామ్ లింకులు తెలంగాణ‌లో తేల‌డంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో అల‌జ‌డి పుట్టింద‌ని తెలుస్తోంది.

క్యాసినో కింగ్ చిక్కోటి ప్ర‌వీణ్ కేసు ద‌ర్యాప్తును ఈడీ కొన‌సాగిస్తోంది. ప్రాథ‌మికంగా సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం సుమారు 20 మంది ప్ర‌జాప్ర‌తినిధులకు నోటీసులు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. వాళ్ల‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు ఉన్నార‌ని వినికిడి. క్యాసినో మూలాలు ఏపీలోనూ ఉండ‌డంతో అక్క‌డి ఎమ్మెల్యేలు కొంద‌రికి ఈడీ నోటీసులు అందాయ‌ని తెలుస్తోంది. అటు కేసీఆర్ ఇటు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని కొంద‌రు క్యాసినో కేసులో ఇరుక్కున్నార‌ని రెండు వారాలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాత్కాలికంగా స‌ద్దుమ‌ణిగిన‌ప్ప‌టికీ మ‌నీల్యాండ‌రింగ్‌కు సంబంధించిన ఆన‌వాళ్ల‌ను ఈడీ బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం తెలంగాణ కేంద్రంగా జ‌రిగింద‌ని బీజేపీ ఎంపీ వ‌ర్మ ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.