KCR-KTR: తెలంగాణ ప్రజలు సిరి సంపదలతో వర్ధిల్లాలి: కేసీఆర్, కేటీఆర్

  • Written By:
  • Updated On - January 13, 2024 / 09:30 PM IST

KTR: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలుగు ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని కేటీఆర్ కోరుకున్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండగలను జరుపుకోవాలన్నారు. ఈ పండగ సందర్భంగా పతంగులు ఎగరేసే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖరరావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్నారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.

ఇక తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ. గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ. భోగి మంటలు.. రంగ వల్లులు.. హరిదాసుల కీర్తనలు. గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు. రైతు లోగిళ్ళలో ధాన్యం రాసులు.. పిండి వంటల ఘుమఘుమలు. బంధు మిత్రుల సందళ్ళతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అంటూ శుభాకాంక్షలు తెలిపారు.