Site icon HashtagU Telugu

MLC Kavitha : నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న కవిత

Telangana Jagruti

Telangana Jagruti

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. ఆగస్టు 4 నుండి 7 వరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్ష (Hunger Strike) చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కవిత ఈ దీక్ష చేయనున్నారు. రాష్ట్ర శాసనసభ, మండలిలో ఆమోదం పొందిన బిల్లులను కేంద్రం ఇంకా ఆమోదించకపోవడంతో, ఈ నిరాహార దీక్ష ద్వారా ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు.

అనుమతి రాకపోయినా దీక్ష కొనసాగిస్తానంటున్న కవిత

దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి కోరినప్పటికీ, ఇప్పటికీ అధికారిక అనుమతి రాకపోవడంతో కవిత స్పందిస్తూ, “అనుమతి లభిస్తే అక్కడే, లేకపోతే ఎక్కడైనా నిరాహార దీక్ష చేస్తాం” అంటూ స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (UPF) సహా బీసీ సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొనడానికి సన్నద్ధమవుతున్నారు. కవిత పిలుపుతో ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారే అవకాశముంది.

తెలంగాణ ప్రభుత్వం 2025 మార్చి 22న విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు కీలక బిల్లులను శాసనసభలో ఆమోదించింది. కానీ, ఇవి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్రం నుంచి ఇప్పటివరకు అనుమతి రాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యంగా భావిస్తున్న కవిత, కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు ప్రభుత్వ విధానాన్ని తెలంగాణ కూడా అనుసరించాలని, న్యాయపరంగా పోరాడాలని కవిత పునరుద్ఘాటించారు.

కవిత గతంలో అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం చేసిన నిరాహార దీక్షకు అనుకూలంగా వచ్చిన ఫలితాల్ని గుర్తు చేస్తూ, బీసీ రిజర్వేషన్ ఉద్యమం కూడా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామని, కేంద్రం పట్టించుకోకపోతే మరింత తీవ్రతరమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కవిత దీక్ష నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.