Site icon HashtagU Telugu

MLC Kavitha :ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ

MLC Kavitha Fire

MLC Kavitha Fire

MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాలపై మరోసారి సునిశిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అబిడ్స్‌ పోస్టాఫీస్ ఎదురుగా ఆమె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టుకార్డు రాసి, ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, “ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ పరిపాలనపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమే” అని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తాను కలలో కూడా రాష్ట్రానికి నష్టం చేయలేదని, ఆయన ధైర్యాన్ని కాంగ్రెస్ నాయకులు బాగా గుర్తించారని చెప్పారు. “కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు” అంటూ వ్యాఖ్యానించారు.

కవిత వ్యాఖ్యల్లో రేవంత్ రెడ్డి పాత్రపై తీవ్ర విమర్శలు కనిపించాయి. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజాభవన్‌కు ఆహ్వానించి హైదరాబాద్ బిర్యానీ తినిపించింది రేవంత్ రెడ్డి. గోదావరి నీటిని గిఫ్ట్ ప్యాక్‌లో కట్టి ఆయనకు ఇచ్చారు,” అని విమర్శించారు. కేసీఆర్ హయాంలో బనకచర్ల ప్రాజెక్ట్ విషయమై ఎలాంటి చర్చలు జరగలేదని, ఎక్కడా సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఆమె స్వాగతించారు. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తప్పనిసరి. హైకోర్టు ఇచ్చిన గడువులోగా ప్రభుత్వం జీఓ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలి. ఇలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం క్షమించదు” అని ఆమె స్పష్టం చేశారు.

Exit mobile version