తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి(CM Chandrababu)కి కీలక లేఖ (Letter ) రాసారు. ఈ లేఖలో భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం, పోలవరం ముంపు ప్రాజెక్టు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను చట్టపరమైన పారదర్శకత లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండగా, చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ఆమె గుర్తు చేశారు.
కవిత లేఖలో పేర్కొనబడిన ప్రధాన సమస్య భద్రాచలం రామాలయానికి సంబంధించిన భూముల భద్రతపై ఉంది. పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న భూములు భద్రాచలం ఆలయానికి చెందవచ్చునన్న కారణంగా వాటిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. రామాలయ అధికారులైన రమాదేవి గారి మీద కూడా దాడులు జరిగాయని, ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామమని ఆమె అన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాముడి పేరిట రాజకీయం చేస్తుంటే, అదే రాముడి ఆలయాన్ని ముంచేసే పనిలో పడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఈ ఐదు గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. వారు విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక సేవల కోసం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కవిత అన్నారు. భద్రాచలం పట్టణానికి అతి సమీపంలో ఉండి కూడా పరిపాలనాత్మకంగా వేరే రాష్ట్రంలో ఉండటం వల్ల ఆ ప్రజలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇది మానవతా పరంగా కూడా బాధాకరమైన పరిణామమని ఆమె పేర్కొన్నారు.
చివరిగా.. ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు, భద్రాచల రామాలయ భూములను రక్షించేందుకు, యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కవిత లేఖ ద్వారా కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోరికలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని ఆమె అభిప్రాయపడారు. ఈ లేఖకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇస్తుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.