కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లీడర్’ (Leader) శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త తరం నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. “తల్లి గర్భం నుంచి నాయకత్వ లక్షణాలతో ఎవరూ పుట్టరు, నేర్చుకుంటూ, మార్చుకుంటూ ఎదిగేవాడే నిజమైన నాయకుడు అవుతాడు” అంటూ ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు.
తెలంగాణ జాగృతి కాలానుగుణంగా మారుతూ ముందుకు సాగుతోందని, అదే ఈ సంస్థ బతికుండే బలమైన కారణమని పేర్కొన్నారు. “సాంస్కృతిక మౌలికతలు, సంప్రదాయాలు మన జీవనశైలిలో భాగం కావాలి. అవగాహనతో కూడిన మార్గదర్శనం లేని నాయకత్వం ఎన్నటికీ నిలదొక్కుకోలేదు” అని చెప్పారు. వ్యక్తిగత విమర్శలు కాకుండా విషయపరమైన విమర్శలు చేయడం నేర్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. పక్కవారిని తిడితే మనకే కంటెంట్ లేకపోవడం స్పష్టమవుతుందని అన్నారు.
Diet with Juice : డైట్ పేరిట బరువు తగ్గేందుకు కేవలం పండ్ల రసాలే తాగుతున్నారా? మీ ప్రాణాలకే డేంజర్
ఓ తాజా సర్వే ప్రకారం సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 11వ స్థానంలో ఉందని గుర్తు చేసిన ఆమె, యువత సామాజిక బాధ్యతతో కూడిన నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మహాత్మాగాంధీ ఎప్పుడూ అధికార పదవుల్లో లేనిప్పటికీ, ప్రజల గుండెల్లో నిలిచారని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి నుంచి ‘గాంధీగిరి’కి నూతన రూపం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విమర్శలు కూడా మర్యాదగా, హేతుబద్ధంగా చేయాలన్నది ఆమె సూచన.
సాంస్కృతిక పునాదులు లేకుండా జాతుల అభివృద్ధి సాధ్యం కాదని, అలాంటి సమాజం పునాది లేని బిల్డింగ్ లాంటిదని స్పష్టంచేశారు. తెలంగాణ జాతికి గొప్ప సాంస్కృతిక నేపథ్యం ఉందని, దాన్ని పరిరక్షించేందుకు ‘జాగృతి’ నిరంతరం శ్రమిస్తోందన్నారు. ఆధునిక నాయకత్వాన్ని సాంస్కృతిక, మానవీయ విలువలతో మేళవించి తీర్చిదిద్దే దిశగా ఈ శిక్షణ కార్యక్రమాలు సాగాలన్నదే ఎమ్మెల్సీ కవిత సందేశం.