తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో విపక్షాలు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం జిల్లా ‘జనం బాట’ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, ప్రభుత్వ వ్యతిరేకత గ్రామాల వరకూ వ్యాపించినప్పటికీ BRS, BJPలు ప్రజా సమస్యలను సరిగా వెలుగులోకి తేవడంలో విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు పెరుగుతున్నాయని, కానీ వాటికి సరైన రాజకీయ వేదికను ఇప్పటివరకు ఏ విపక్షం అందించలేదని ఆమె విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలను ఉదాహరణగా చూపుతూ కవిత, “కాంగ్రెస్ గెలుపు అనేది వారి పనితనానికి వచ్చిన మద్దతు కాదు, విపక్షాల వైఫల్య ఫలితం మాత్రమే” అని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ అసంతృప్తిని ప్రజా చర్చల స్థాయికి తీసుకురావడంలో ప్రస్తుత ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. గ్రామాలలో కాంగ్రెస్‌పై తిట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయని, అయితే ఆ భావజాలాన్ని రాజకీయ శక్తిగా మార్చడంలో విఫక్షాల సహకారం లేకపోవడం ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తున్నదని ఆమె అభిప్రాయపడ్డారు.
LPG Gas: అమెరికాతో మోదీ సర్కార్ బిగ్ డీల్.. వంటగ్యాస్ చీప్ కేంద్ర మంత్రి సంచలనం !
ఇకపై ప్రజా సమస్యలపై నిరసనలు, పోరాటాలు చేపట్టి నిజమైన విపక్ష పాత్రను తామే పోషించనున్నామని కవిత హెచ్చరించారు. “మరెవరో తిట్టేలా ప్రేరేపించడం కాదు, ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు హరీశ్ రావే సమాధానం చెప్పాలి” అని ఆమె సవాలు విసిరారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త విన్యాసాలకు ఇది నాంది కావచ్చని, కవిత వ్యాఖ్యలు విపక్ష రాజకీయాల దిశను మార్చేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
