Delhi Liquor Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ నాయకుల ప్రమేయం ఉందని, వారిని కటకటాల వెనక్కి వెళ్లకుండా ఎవరూ రక్షించలేరని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ కేసులో ఉన్న సంబంధం గురించి యావత్ దేశానికి తెలుసని ఆయన అన్నారు. స్కామ్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేస్తామని, వారిని ఎవరూ రక్షించలేరని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని అన్నారు.
100 కోట్ల మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కవిత నిధులు సమకూర్చారని ఆరోపించారు.మిషన్ భగీరథను దేశంలో అతిపెద్ద దోపిడీ అని పేర్కొన్నారు. నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారం ఐదు రెట్లు పెరిగిందని అదే సమయంలో ముఖ్యమంత్రి ఆదాయం 10 రెట్లు పెరిగిందని చౌబే అన్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. దళితుల జీవితాలను బాగుచేయడానికి బదులు కొంతమంది వ్యక్తుల పక్షాన ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ధరణిని ప్రస్తావిస్తూ.. అధికార పార్టీ నేతలకు ఇదొక మనీ స్పిన్నర్’గా మారిందని, బీజేపీ అధికారంలోకి రాగానే వెబ్‌సైట్‌ను మూసివేస్తామని, కేంద్రం అమలు చేస్తున్న భూ రికార్డుల వ్యవస్థను పొడిగిస్తామని మంత్రి అన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్‌లకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసిందని తెలిపిన మంత్రి.. ఇంతవరకు వాటి పనితీరు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
Also Read: Telangana Polls : జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్