Site icon HashtagU Telugu

Kavitha : కవిత మంచిర్యాల పర్యటన..కేటీఆర్ లేకుండానే ప్లెక్సీలు

Ktr Photo

Ktr Photo

మంచిర్యాలలో ఎమ్మెల్సీ కవిత (kavitha) పర్యటన వివాదాస్పద రాజకీయ పరిణామాలకు కారణమైంది. ఆమెకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేటీఆర్, హరీష్ రావు ఫొటోల గైర్హాజరు కావడం, పార్టీ శ్రేణులు దూరంగా ఉండటం రాజకీయంగా స్పష్టమైన సంకేతాలుగా విశ్లేషించబడుతోంది. కవిత తన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో చీలికకు దారితీసే పరిస్థితులను తలెత్తించారని పలువురు విశ్లేషకుల అభిప్రాయం. పార్టీపై, తన తండ్రి కేసీఆర్ పై గౌరవం కొనసాగించినా, ఆమె విమర్శలు కేటీఆర్, హరీష్ ను లక్ష్యంగా చేసుకోవడమే అనుమానాలను రేకెత్తిస్తోంది.

Rajnath Singh : మీ సన్నద్ధతే దాయాదికి గట్టి హెచ్చరిక : రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. ఆమె పరోక్షంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించగా, హరీష్ రావు బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు కవిత పార్టీపై ఆవేదనను సూచిస్తున్నా, పార్టీలో అంతర్గత విభేదాలను బహిరంగంగా ప్రదర్శించడమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా బీజేపీతో బీఆర్ఎస్ విలీనం విషయమై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, కేసీఆర్‌తో సంబంధమైన లేఖను బయటపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం, ప్రస్తుతం బీఆర్ఎస్ లో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని చూపిస్తున్నాయి.

మంచిర్యాలలో మాధ్యమాలతో చిట్‌చాట్ లో కవిత తన ఆవేదనను వ్యక్తపరచారు. పార్టీకి అన్యాయం జరగకుండా కాపాడుకోవడమే తన తపన అని, పదేళ్లుగా తాను ఎంత కష్టపడ్డానో తెలిపారు. ఆమెకు స్వంత జెండా లేదా, స్వతంత్ర అజెండా లేదని, కేసీఆర్ తప్ప మరొక నాయకత్వాన్ని తాను అంగీకరించనని వ్యాఖ్యానించడం ద్వారా పరోక్షంగా కేటీఆర్ నాయకత్వంపై తన అసంతృప్తిని మరోసారి వెలిబుచ్చారు.