తెలంగాణ టీడీపీ (Telangana TDP) బాధ్యతలను తీసుకున్న కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) తాను ప్రకటించినవిధంగా టీడీపీని పరుగులు పెట్టిస్తున్నారు. స్తబ్దుగా ఉన్న పార్టీలో నూతనోత్తేజం నింపారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎవరో ఒకరిని పార్టీలో చేర్చుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒక్క ఖమ్మం సభతో తానేంటో చాటి చెప్పి, బాబు నమ్మకాన్ని మరింత చూరగొన్నాడు. ఖమ్మం సభతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ఇలా జనంలో ఉండే కార్యక్రమాలే కాకుండా యాగాలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ టీడీపీ ఆఫీసులో ఆయన దశ మహా విద్యాపూర్వక నవ చండీయాగం నిర్వహించారు. ఈ యాగం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.
చంద్రబాబు కూడా యీ యాగానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణలో యాగాలు చేయడంలో నిపుణుడు. ఆయన ఏ కార్యక్రమం చేయాలన్నా యాగాలు చేస్తూంటారు. ఈ కోవలోనే కాసాని (Kasani Gnaneshwar) కూడా యాగాలను నమ్ముకుంటున్నారు. పెద్ద ఎత్తున యాగాలను చేయడంతో పాటు బహిరంగసభలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఖమ్మంసభ చర్చనీయాంశం అవుతూండగా త్వరలో నిజామాబాద్‌లోనేసభ పెట్టాలని నిర్ణయించుకున్నారు. సభ నిర్వహణ తేదీని ఖరారు చేయనున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌లో యాక్టివ్ గా లేని నేతలను,ఇతర పార్టీలోకి వెళ్లిన క్యాడర్ ను మళ్లీ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికల ఏడాది అయినందున టీడీపీ మరింత జోరుగా కార్యక్రమాలను చేపట్టాలని అనుకుంటోంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని, బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి.. ఎన్నికలకు సిద్ధమవుతామని కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) స్పష్టం చేశారు. టీడీపీ కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని… ఆషామాషీగా కాకుండా స్పష్టమైన స్ట్రాటజీతోనే తెలంగాణలో రాజకీయాలు చేస్తోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ కచ్చితంగా ప్రభావం చూపబోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
