Karnataka Results: తెలంగాణలో కర్ణాటక రిజల్ట్స్ రిపీట్.. గెలుపుపై రేవంత్ ధీమా

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని అన్నారు.

  • Written By:
  • Updated On - May 13, 2023 / 12:55 PM IST

అందరూ ఊహించినట్టుగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ (Congress) దూసుకుపోతోంది. బీజేపీకు దిమ్మతిరిగే షాక్ ఇస్తూ అత్యధిక స్థానాలను గెలుచుకుంటోంది. అయితే కర్ణాటక రిజల్ట్స్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కర్ణాటకలో వచ్చిన ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఎర్రకోటపై కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ (BJP) ని ఓడించడం ద్వారా మోదీని ఓడించారని, జేడీఎస్‌ను ఓడించడం ద్వారా కేసీఆర్‌ను ఓడించినట్లు అయిందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. కర్ణాటక ఫలితాలను టీపీసీసీ ఆహ్వానిస్తుందన్నారు.

కర్ణాటక ఫలితాల ద్వారా మోదీ, బీజేపీని ప్రజలు స్పష్టంగా తిరస్కరించారని రేవంత్ రెడ్డి చెప్పారు. జేడీఎస్ ద్వారా హంగ్ అసెంబ్లీ తీసుకురావాలన్న కేసీఆర్ ఆశలు ఫలించలేదన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ద్వారా ఈ ఫలితాలు వచ్చాయని, తెలంగాణలోనూ స్దిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ క్యాంపు రాజకీయాలకు కర్ణాటకలో చోటు ఉండదని అన్నారు.  కేసీఆర్ మద్దతు ఇచ్చిన జేడీఎస్ పార్టీ బీజేపీకి ఎలా మద్దతిస్తుందని రేవంత్ ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయం కావడంతో టీకాంగ్రెస్ సంబురాలు చేసుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, నాయకులు ర్యాలీ నిర్వహిస్తున్నారు.

Also Read: Karnataka Results: నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు: కుమారస్వామి రియాక్షన్