Karnataka CM: కేటీఆర్ ట్వీట్..‘పెద్ద జోక్’

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బెంగళూరు సిటీ పరిస్థితిపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - April 6, 2022 / 04:15 PM IST

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బెంగళూరు సిటీ పరిస్థితిపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఓ స్టార్టప్ నిర్వాహకుడు బెంగళూరులో సరైన సదుపాయాలు లేవంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్  “మీ బ్యాగ్‌లను ప్యాక్ చేసి హైదరాబాద్‌కు వెళ్లండి” అంటూ రియాక్ట్ అయ్యారు. ఈ ట్వీట్‌పై పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించగా, తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా స్పందించారు. బొమ్మై కేటీఆర్ వ్యాఖ్యలను “పూర్తి జోక్” అని కొట్టిపారేశారు. “ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు బెంగళూరుకు వస్తున్నారు. బెంగళూరులో అత్యధిక స్టార్టప్‌లు ఉన్నాయి. బెంగుళూరులో అత్యధిక సంఖ్యలో యునికార్న్‌లు ఉన్నాయి’’ అని ఆయన గుర్తు చేశారు.

రోడ్లు, విద్యుత్ సరఫరా, ఫుట్‌పాత్‌లతో సహా బెంగళూరులో మౌలిక సదుపాయాల కొరత గురించి Khatabook, Booking.com వ్యవస్థాపకుడు రవీష్ నరేష్ ట్వీట్ చేయడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశమైంది. పార్టీలకతీతంగా కర్ణాటక రాజకీయ నాయకులు కేటీఆర్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్..  “మిత్రమా, నేను మీ సవాలును స్వీకరిస్తున్నా. 2023 చివరి నాటికి, కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. మేం భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా బెంగళూరు కీర్తిని పునరుద్ధరిస్తాం‘‘ అంటూ బదులిచ్చారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘కర్ణాటక రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. హైదరాబాద్, బెంగళూరు నగరాలు యువతకు ఉద్యోగాలు సృష్టించేలా పోటీ పడదాం అంటూ రిట్వీట్ చేశారు. తాజాగా కర్ణాటక సీఎం రియాక్ట్ కావడంతో మరోసారి బెంగళూరు వార్తల్లోకెక్కింది.