Site icon HashtagU Telugu

Kanti Velugu : తెలంగాణ‌లో కంటి వెలుగు ప‌థ‌కం కింద 1.5 కోట్ల మందికి ప‌రీక్ష‌లు

Kanti velugu

Kanti velugu

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలను దాదాపు 1.50 కోట్ల మంది ప్రజలు వినియోగించుకుని లబ్ధి పొందారని రాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద మొత్తం 21,29, 865 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు.అంధత్వ రహిత తెలంగాణ నినాదంతో ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎనిమిది నెలల పాటు కొనసాగింది.

ఉచిత కంటి పరీక్షలతో పాటు 50 లక్షల మందికి కళ్లద్దాలు కూడా పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అనుకున్న లక్ష్యం మేరకు రాష్ట్రంలో 79 పనిదినాల్లో 88.04 శాతం మందికి కంటి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. 100 పనిదినాల లక్ష్యంలో రాష్ట్రంలోని అందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటి సంరక్షణ సమయంలో ఇతర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న అధికారులు తెలిపారు. పర్యవేక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది. కంటి పరీక్షల కార్యక్రమం ఇలాగే కొనసాగితే 4 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలో 2 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

ఈ పథకాన్ని రాష్ట్రంలో జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు ముందస్తుగా క్యాంపులను ప్లాన్ చేసి అమలు చేస్తున్నారు. శిబిరంలో ‘నియర్‌ విజన్‌’ సమస్య ఉన్నవారు సర్వసాధారణంగా కనిపిస్తుండటం గమనించి.. అన్ని జిల్లాల్లోనూ దగ్గరగా చూడలేక ఇబ్బంది పడే వారు ఎక్కువగా ఉన్నారని శిబిరాల్లో నమోదైన గణాంకాలు చెబుతున్నాయి. 40 ఏళ్లు పైబడిన చాలా మంది ప్రజలు దగ్గరి దృష్టి లోపంతో శిబిరానికి వస్తున్నార‌ని అధికారులు తెలిపారు. అలాంటి వారికి వెంటనే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తారు. వీటితో పాటు కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి విటమిన్‌ ఎ, డి, బి కాంప్లెక్స్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 50 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా క్యాటరాక్ట్‌తో బాధపడుతున్నారని కూడా గమనించారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి మొబైల్ ఫోన్ల ద్వారా చికిత్స సమయం గురించి సమాచారం అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.