Kalvakuntla Kavitha : ‘‘నేను గతంలో నిజామాబాద్ లోక్‌సభ ఎంపీగా పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఓడగొట్టారు’’ అని ఈరోజు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ‘‘ఎంపీ ఎన్నికల్లో నేను ఓడిపోయాక.. నిజామాబాద్ జిల్లాలో నాకు ప్రొటోకాల్ ఉండాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి నాన్నే నన్ను ఎమ్మెల్సీగా చేశారు’’ అని కవిత వెల్లడించారు. ఇంతకీ 2019 నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగింది ? కవిత ఎలా ఓడిపోయారు ? ఆమె ఓటమికి ప్రధాన కారణాలేంటి ? ఈ కథనంలో చూద్దాం..
Also Read :Operation Sindoor : భారతీయుల ఐక్యతా శక్తిని ఎవరూ ఢీకొనలేరు : ప్రధాని మోడీ
ఆ ఎన్నికల గణాంకాలివీ..
2019లో జరిగిన నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) రెండో స్థానంలో నిలిచారు. ఆమెకు ఆనాడు 4 లక్షల 9వేల ఓట్లు వచ్చాయి. అక్కడి నుంచి విజయం సాధించిన బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌కు 4.80 లక్షల ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా చూసుకుంటే పోలైన మొత్తం 10 లక్షల 63వేల ఓట్లలో అత్యధికంగా 45.22 శాతం ఓట్లను అర్వింద్ దక్కించుకున్నారు. మిగతా 38.55 శాతం ఓట్లను కల్వకుంట్ల కవిత పొందారు. దాదాపు 71వేల ఓట్ల తేడాతో కవిత ఓడిపోయారు. ఆశ్చర్యకరంగా మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్‌కు 69,240 ఓట్లు వచ్చాయి. అంటే మధు యాష్కీ గౌడ్ చీల్చిన ఓట్లు కవితను ఓడించాయన్న మాట.
Also Read :Kavitha : ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారు : కవిత
కవిత ఓటమికి ఎన్నో కారణాలు
2019 నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల టైంలో పసుపు బోర్డు అంశం టాప్ ప్రయారిటీగా మారింది. రైతుల్ని ఆనాడు కవిత కానీ, కేసీఆర్ కానీ పెద్దగా పట్టించుకోలేదన్న వాదనలు ఉన్నాయి. దీన్ని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పక్కా ప్లాన్‌తో ఓట్లుగా మార్చుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో అంతగా ప్రచారం చేయలేదు. చేరికలను పెద్దగా ప్రోత్సహించలేదు. మరోవైపు ధర్మపురి అరవింద్ మాత్రం బీజేపీలోకి పెద్దఎత్తున చేరికలను ప్రోత్సహించారు. ప్రత్యేకించి రైతు వర్గానికి చేరువయ్యారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఓ వర్గం బీఆర్ఎస్ నేతల నుంచి కవితకు మద్దతు లభించలేదని చెబుతుంటారు. ఈ అంశాన్ని కవిత కూడా సీరియస్‌గా తీసుకోలేదు. కవిత, మధు యాష్కీ గౌడ్‌లు వ్యూహ రచనలో విఫలం కావడం అనేది ధర్మపురి అరవింద్ విజయానికి బాటలు వేసింది.