Site icon HashtagU Telugu

KCR and AP Politics : ఏపీలో ఎంట్రీకి `క‌ల్వకుంట్ల‌`అస్త్ర‌శ‌స్త్రాలు!

Kcr, Ktr, Kavitha, Trs

Kcr, Ktr, Kavitha, Trs

ఏదో ఒక రూపంలో ఏపీ ప‌రిస్థితిని కించ‌ప‌రిచేలా టీఆర్ఎస్ అగ్ర‌నేత‌లు మాట్లాడుతున్నారు. ఏడాది కాలంగా ఇలాంటి విమ‌ర్శ‌లు అప్పుడ‌ప్పుడు అసెంబ్లీ లోపల‌, బ‌య‌ట వినిపిస్తున్నారు. ఇదంతా దీర్ఘ‌కాలిక రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగంగా చేస్తోన్న వ్య‌వ‌హారం మాదిరిగా ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తోన్న కేసీఆర్ అండ్ టీమ్ తాజాగా ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగుల గురించి ప్ర‌స్తావించారు. ఆ రాష్ట్రంలో క‌ర్క‌శంగా టీచ‌ర్లు, ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ ఉంటుంద‌ని వ్యాఖ్యానించ‌డం ఇరు రాష్ట్రాల్లోనూ దుమారం రేగుతోంది.

ప్ర‌భుత్వాల‌కు తెల్ల ఏనుగు మాదిరిగా టీచ‌ర్లు, ఉద్యోగుల బ‌డ్జెట్ ఉంది. తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల బ‌డ్జెట్ మొత్తంలో 70శాతానికి పైగా పెన్ష‌న్లు, జీతాలు ఇత‌ర‌త్రా అల‌వెన్స్ ల రూపంలో ఖ‌ర్చు పెడుతున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత పోటీప‌డి ఆనాడు కేసీఆర్, చంద్ర‌బాబులు ఫిట్మెంట్ ను ఇచ్చారు. ఆ త‌రువాత పీఆర్సీ అంటూ ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి తీసుకురావ‌డం ఉద్యోగుల‌కు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుగా భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 70శాతం ఫిట్మెంట్ ఇచ్చామ‌ని మంత్రి హ‌రీశ్ చెబుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ అంటూ చెప్పుకొచ్చారు. అంటే, మిగిలిన వ‌ర్గాలకు వ్య‌తిరేక‌మ‌ని ప‌రోక్షంగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి.

ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగుల‌ను రెచ్చ‌గొట్టేలా మంత్రి హ‌రీశ్ రావు చేసిన వ్యాఖ్యల‌కు ధీటుగా ఏపీ మంత్రి బొత్సా సత్య‌నారాయ‌ణ కౌంట‌ర్ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల్లోని ఉద్యోగుల‌కు వ‌స్తోన్న జీతాల‌ను పోల్చుకుని చూద్దాం అంటూ స‌వాల్ విసిరారు. ఇలా, ఏపీ ,తెలంగాణ స‌ర్కార్ టీచ‌ర్లు, ఉద్యోగుల జీతాల‌ను, ఫిట్మెంట్ రాజ‌కీయ అస్త్రంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉద్యోగుల‌ను సానుకూలంగా మ‌లుచుకోవ‌డం ఇరు ప్ర‌భుత్వాల ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. బ‌డుగు. బ‌ల‌హీన‌, రైతాంగాన్ని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వాలు చేసిన కార్య‌క్ర‌మాలు ఏమిటో చ‌ర్చ‌కు పెట్ట‌కుండా ఉద్యోగుల‌కు ఇచ్చే బెనిఫిట్స్ ను తెర‌మీద‌కు తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునేలా ప్ర‌త్యేక‌హోదాకు సానుకూలంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం అప్ప‌ట్లో స్పందించింది. అమ‌రావ‌తి ప్రాజెక్టు కూలిపోవ‌డంతో తెలంగాణ‌కు మేలు జ‌రిగింద‌ని మంత్రి హ‌రీశ్ ఒకానొక సంద‌ర్భంలో అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ఒక‌ప్పుడు ఏపీలో ఎక‌రం అమ్మితే తెలంగాణ‌లో మూడు ఎక‌రాలు వ‌చ్చేద‌ని, ఇప్పుడు రివ‌ర్స్ అయింద‌ని ప‌లుమార్లు అసెంబ్లీ వేదిక‌గా సీఎం కేసీఆర్ ప్ర‌స్తావిస్తూ ఏపీ నేత‌ల చేత‌గానిత‌నాన్ని ఎత్తిచూపారు. విభ‌జ‌న చ‌ట్టంలోని 9, 10 షెడ్యూల్ తాలూకూ ఆస్తుల‌ను ఇవ్వ‌డానికి మెలిక‌పెడుతోన్న కేసీఆర్ స‌ర్కార్ ఏపీలోని రాజ‌కీయ పార్టీల స్వార్థాన్ని బ‌య‌ట‌పెడుతున్నారు. మొత్తం మీద ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి స‌ర్వ శ‌స్త్రాల‌ను సిద్ధం చేసిన కేసీఆర్ అండ్ టీమ్ తాజాగా ఉద్యోగులు, టీచ‌ర్ల వ్య‌వ‌హారాన్ని తెర‌మీద‌కు తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.