CM KCR Silent: మౌన‌మేల‌నోయి..!

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. మైండ్ దొబ్బింద‌ని ఢిల్లీ నేత‌లు అంటున్న‌ప్ప‌టికీ సైలెంట్ గా ఉన్నాడు. అరెస్ట్ కు సిద్ధంగా ఉండాల‌ని వార్నింగ్ ఇస్తున్న‌ప్ప‌టికీ ఉలుకుప‌ల‌కు లేకుండా ఉన్నాడు. తేల్చుకుంటానంటూ నెల క్రితం మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ ఒక్క‌సారిగా నిశ్శ‌బ్దాన్ని పాటిస్తున్నాడు.

  • Written By:
  • Updated On - January 7, 2022 / 03:41 PM IST

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. మైండ్ దొబ్బింద‌ని ఢిల్లీ నేత‌లు అంటున్న‌ప్ప‌టికీ సైలెంట్ గా ఉన్నాడు. అరెస్ట్ కు సిద్ధంగా ఉండాల‌ని వార్నింగ్ ఇస్తున్న‌ప్ప‌టికీ ఉలుకుప‌ల‌కు లేకుండా ఉన్నాడు. తేల్చుకుంటానంటూ నెల క్రితం మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ ఒక్క‌సారిగా నిశ్శ‌బ్దాన్ని పాటిస్తున్నాడు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ అరెస్ట్ త‌రువాత బీజేపీ చేసిన యాగీ మీద రియాక్ట్ కాలేదు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా చేసిన ఆరోప‌ణ‌ల మీద స్పందించ‌డానికి ముందుకు రాలేదు. కుమారుడు కేటీఆర్ మీడియా ముందుకొచ్చాడు మిన‌హా కేసీఆర్ మొఖం చాటేశాడు.

ఏదైనా నేరుగా తేల్చుకుంటాన‌ని నెల క్రితం కేసీఆర్ మీడియాకు చెప్పాడు. ఇక నుంచి నేనే త‌గులుకుంటా..అంటూ విప‌క్షాల‌కు వార్నింగ్ ఇచ్చాడు. వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం ఆడుతున్న నాట‌కాన్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చాడు. వ‌రుస‌గా మూడు రోజుల పాటు ప్రెస్ మీట్లు పెట్టాడు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌త్యేకించి మోడీ వాల‌కాన్ని దుయ్య‌బ‌ట్టాడు. చైనా, భార‌త్ స‌రిహ‌ద్దుల్లో ఏమి జ‌రుగుతుందో..చూసుకోండంటూ మోడీకి చుర‌క‌లంటించాడు. వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోతే…మెడ‌లు వంచుతామ‌ని హెచ్చ‌రించాడు. బీజేపీ లీడ‌ర్ల‌ను తెలంగాణ‌లో తిర‌గ‌కుండా చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడు.

వ‌రి ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేస్తోన్న మోసాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి క్షేత్ర స్థాయి పోరాటాల‌ను చేయించాడు. ఆయ‌న కూడా ఇందిరా పార్కు వ‌ద్ద ఒక రోజు దీక్ష‌కు దిగాడు. వ‌రి ధాన్యం కొనుగోలు చేసే వ‌ర‌కు కేంద్రాన్ని వ‌ద‌లిపెట్ట‌న‌ని భీష్మించాడు. పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రాన్ని నిల‌దీయాల‌ని ఎంపీల‌కు ఆదేశించాడు. ఆ మేర‌కు రెండు రోజుల పాటు పార్ల‌మెంట్ వేదిక‌గా తూతూ మంత్రంగా ఎంపీలు గ‌ళమెత్తారు. కేంద్రం మంత్రులు కూడా అంతే వేగంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై రియాక్ట్ అయింది. బియ్యం ఎంతైనా కొనుగోలు చేస్తామ‌ని లెక్క‌ల‌తో స‌హా చెప్పింది. బాయిల్డ్ రైస్ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన జిమ్మిక్కును బ‌య‌ట‌పెట్టింది.
ఖ‌రీఫ్ ధాన్యం కొనుగోలు చేయాల‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా సుదీర్ఘ పోరాటం చేయ‌కుండా ఆక‌స్మాతుగా ఎంపీలు హైద‌రాబాద్ వ‌చ్చేలా కేసీఆర్ సంకేతాలు ఇచ్చాడు. దీంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు నిల‌దీసే పరిస్థితికి రావ‌డంతో మంత్రుల‌ను ఢిల్లీ కి పంపాడు. నాలుగు రోజులున్న మంత్రులు ఉత్త చేతుల‌తో వెనుతిరిగారు. ఇలా కేసీఆర్ ఎందుకు ఎంపీలు, మంత్రుల‌తో చేయించాడో..ఎవ‌రికీ అంత‌బ‌ట్ట‌లేదు. ఆయ‌న మీడియా ముందుకు రావ‌డం కూడా మూడు రోజుల ముచ్చ‌ట‌గా మిగిల్చాడు. బీజేపీ ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు కేసీఆర్ వాల‌కాన్ని వివిధ రూపాల్లో తీసుకెళ్ల‌డం స‌క్సెస్ అయింది.

ఆ లోపు జోన‌ల్ ప‌ద్ద‌తిలో ఉద్యోగుల బ‌దిలీల వ్య‌వ‌హారం వ‌చ్చింది. ఆ మేర‌కు జీవో నెంబ‌రు 317ను కేసీఆర్ స‌ర్కార్ విడుద‌ల చేసింది. దీంతో రైతుల‌తో పాటు ఉద్యోగుల ఆత్మ‌హ‌త్య తెర‌మీద‌కు వ‌చ్చింది. వెంటనే స్పందించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు క‌రీంన‌గ‌ర్ వేదిక‌గా రాత్రి జాగ‌ర‌ణ కు దిగాడు. సొంత క్యాంపు ఆఫీస్ లో జ‌రిగిన జాగ‌ర‌ణ‌ను భ‌గ్నం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేసిన పోలీసులు ఓవ‌రాక్ష‌న్ చేశారు. బండి సంజ‌య్ తో పాటు బీజేపీ నేత‌ల‌పై కేసులు పెట్టి జైలుకు పంపారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య రాజ‌కీయ వార్ తారాస్థాయికి చేరింది. ఢిల్లీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించే వ‌ర‌కు ఇష్యూ వెళ్లింది. జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా తెలంగాణ వ‌చ్చాడు.దీంతో తెలంగాణ బీజేపీ తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌యింద‌ని సంకేతాలు వెళ్లాయి.

కాళేశ్వ‌రం, మిష‌న్ భ‌గీర‌థ‌లో జరిగిన అవినీతిని న‌డ్డా బ‌య‌ట‌పెట్టాడు. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చాడు. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన బండి సంజ‌య్ తెలంగాణ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డాడు. కేసీఆర్ స‌ర్కార్ నిల‌బ‌డ‌ద‌ని హెచ్చ‌రించాడు. గ‌తంలోనూ గ్రేట‌ర్‌, దుబ్బాక‌, హుజురాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇవే మాట‌ల‌ను బండి వినిపించాడు. మ‌ళ్లీ ఇప్పుడు కేసీఆర్ ను జైల్లో పెడ‌తామంటూ హెచ్చ‌రిస్తున్నాడు. బీజేపీ ఇంత పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కేసీఆర్ మౌనంగా ఉండడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.