Site icon HashtagU Telugu

Harish Rao : మాజీ మంత్రి హరీశ్ రావుకు మరోసారి కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

Harish Rao

Harish Rao

Harish Rao : తెలంగాణకు అతి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుగా ఖ్యాతి పొందిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (KLIP) ప్రస్తుతం తీవ్ర విమర్శలు, విచారణల మధ్యలో ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు, నిర్వహణపరమైన వైఫల్యాలపై న్యాయమూర్తి జస్టిస్ పీ చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ గత ఏడాది కాలంగా లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది.

విచారణలో భాగంగా, బ్యారేజీల డిజైన్, నిర్మాణ నాణ్యత, సాంకేతిక పరమైన తప్పిదాలు, ఆర్థిక ఖర్చులు, విధానాలు మొదలైన వాటిపై ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఇతర సంబంధిత అధికారులను విచారించారు. వారి నుండి అఫిడవిట్లు తీసుకుని, వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది.

ఇదిలా ఉండగా, ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు జూన్ 9న కమిషన్ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అయితే, విచారణ కొనసాగుతున్న క్రమంలో, కమిషన్ మరోసారి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. ఆయనను మళ్లీ విచారణకు హాజరుకావాలని కోరుతూ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం హరీశ్ రావు మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం బీఆర్కే భవన్‌కు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

అంతకుముందు, నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. అనిల్ కుమార్కు కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి గ్రౌటింగ్ జరిగిన అంశాన్ని దాచిపెట్టినందుకు, అలాగే ఉన్నత పదవిలో ఉండి తప్పు సమాచారం ఇచ్చినందుకు చైర్మన్ చంద్రఘోష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే అనిల్ కుమార్‌కు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, కమిషన్ హరీశ్ రావును తిరిగి విచారణకు పిలవడం ప్రాజెక్టుపై విచారణ మరింత లోతుగా సాగుతోందని సంకేతాలు ఇస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఈ కమిషన్ నివేదిక కీలకంగా మారనుంది.

Bathukamma Kunta : బతుకమ్మ కుంట పునర్జీవం.. హైడ్రా విజయపథం

Exit mobile version