Keshavrao – Congress : కాసేపట్లో కేసీఆర్‌తో కేకే భేటీ.. కారు పార్టీకి గుడ్ బై ?

Keshavrao - Congress :  లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారి పోతున్నాయి.

  • Written By:
  • Updated On - March 28, 2024 / 04:31 PM IST

Keshavrao – Congress :  లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారి పోతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన  బీఆర్ఎస్ సీనియర్ నేత  కే.కేశవరావు అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు కే.కేశవరావు బుధవారం తన కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారని సమాచారం. ఇవాళ సాయంత్రంకల్లా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తోనూ కేకే భేటీ  అవుతారని తెలుస్తోంది. అనివార్య పరిస్థితుల్లో తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లాల్సి వస్తోందనే విషయాన్ని కేసీఆర్‌కు కేకే  వివరిస్తారని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న  కె.కేశవరావును ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి కూడా కలిశారు. బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి ఆమెతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన రాజకీయ చర్చల్లో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో(Keshavrao – Congress) నాకు సరైన రీతిలో గౌరవం దక్కింది. నేను కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఇప్పుడు సొంత పార్టీ వైపు చూస్తే తప్పేముంది’’ అని తన సన్నిహితులతో కేకే అన్నట్లు తెలిసింది.

బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే ఎక్కువ సీట్లు

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సాగుతోన్న సమయంలో కేకేను కాంగ్రెస్‌ నేతలు ఇటీవల కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కేకే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనందున ఎంపీ ఎన్నికల్లో గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఎంపీ ఎన్నికల పోటీ ఉండబోతున్నదని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మొన్న ఒడిపోయాం కాబట్టి ఈసారి మా పార్టీకి అంత బలం లేదు. బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి’’ అని కేకే అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతున్నదన్నారు. ‘‘నేనిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ సీరియస్ గా తీసుకోలేదు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిందనేది నిజమే. ప్రభుత్వంలో, బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, కవిత మాత్రమే కనిపించారు. మిగతా నాయకులు కనిపించలేదు’’ అని కేకే చెప్పారు.

Also Read :Phone Tapping Case : ‘ఫోన్‌ ట్యాపింగ్‌’ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులు.. ఎవరు?