Munugode Elections : మునుగోడు ఓట‌ర్ల‌కు `కేఏ పాల్` అమెరికా హామీ

మునుగోడు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్రజాశాంతిపార్టీ చీఫ్ కేఏ పాల్ నిరుద్యోగుల‌కు ఆమెరికా ఆఫ‌ర్ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 03:40 PM IST

మునుగోడు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్రజాశాంతిపార్టీ చీఫ్ కేఏ పాల్ నిరుద్యోగుల‌కు ఆమెరికా ఆఫ‌ర్ ఇచ్చారు. గ్రామానికి ఒక‌ర్ని అమెరికా పంపిస్తాన‌ని స‌రికొత్త స్లోగ‌న్ అందుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉచిత హామీల‌ను అనేకం చూశాం. కానీ, కేఏ పాల్ తాజాగా చేసిన అమెరికా హామీ మునుగోడు ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. గ‌తంలో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ, ఆ మాట తాను చెప్ప‌లేద‌ని అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌ప్పుకున్నాడు. కేఏ పాల్ మాత్రం ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా లాట‌రీ ద్వారా 59 మందిని ఎంపిక చేసి వాళ్ల‌ను అమెరికా పంపించ‌డానికి సిద్ధం అయ్యారు.

పాల్ తన 59వ పుట్టినరోజు కానుకగా లాటరీ ద్వారా 59 మంది నిరుద్యోగులను యూఎస్‌కి పంపుతామని మంగళవారం ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో 50 వేల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాల్ వీడియో ప్రకటన విడుదల చేశారు ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల మధ్య నిరుద్యోగులు తమ రెజ్యూమ్‌లతో శ్రీవారు హోమ్స్ గ్రౌండ్స్‌కు రావాలని కోరారు. వచ్చిన వారిలో 59 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసి పాస్‌పోర్టులు, అమెరికన్ స్పాన్సర్‌షిప్ వీసాలు ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇంకా ఎక్కువ మంది నిరుద్యోగులు ముందుకు వస్తే 175 గ్రామాల నుంచి ఒక్కొక్కరిని అమెరికాకు పంపిస్తానని అంటున్నారు. బీసీ కుటుంబంలో పుట్టి దళిత మహిళను పెళ్లాడిన తాను నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకోగలను అన్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని, ప్రధాని నరేంద్రమోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాళ్లు ఏమైనా చేశారా?నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని ఆయన అన్నారు. గత నెలలో కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన సిట్టింగ్‌ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజకవర్గం ఖాళీ అయింది. అక్టోబరు-నవంబర్‌లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పాల్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తోంది.