High Court CJ : జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ పేరును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(High Court CJ) పదవికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్నారు. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఎం.ఎస్.రామచంద్ర రావును త్రిపుర హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మహీంద్ర మోహన్ శ్రీవాస్తవను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని రికమెండ్ చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ను కూడా మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న కేఆర్ శ్రీరామ్‌ను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సూచించింది. మొత్తం మీద తెలంగాణ, త్రిపుర, రాజస్థాన్, మద్రాస్ హైకోర్టులకు కొత్త సీజేల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర న్యాయశాఖ పరిశీలించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపుతుంది. రాష్ట్రపతి ఆమోదం లభించగానే ఈ నియామకాలపై అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయి.
Also Read :BJP MP Laxman: ఖర్గేజీ నిజాలు తెలుసుకోండి.. ఇది నయా భారత్ : ఎంపీ లక్ష్మణ్
జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ గురించి..
- జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ 1990వ దశకంలో బిహార్‌లోని పాట్నా, జార్ఖండ్ హైకోర్టులలో న్యాయవాదిగా సేవలు అందించారు.
- ఆయన 2012లో జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు.
- 2017 డిసెంబరు 22 నుంచి 2018 ఫిబ్రవరి 19 వరకు ఆ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు.
- 2023 సంవత్సరంలో జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌కు పదోన్నతి లభించింది. ఆయనను త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా నియమించారు.
- త్వరలోనే ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది.