Ponguleti Srinivas Reddy : జులై 2న కాంగ్రెస్‌ పార్టీలో చేరుతాం.. ఇక మా ల‌క్ష్యం అదే.. స్ప‌ష్టం చేసిన పొంగులేటి

మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు త‌మ అనుచ‌ర గ‌ణంతో ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. భేటీ అనంత‌రం వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు తెలిపారు. జూలై2న ఖ‌మ్మంలో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ ద్వారా కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకోబోతున్న‌ట్లు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

  • Written By:
  • Updated On - June 27, 2023 / 12:09 PM IST

పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) లు ఏ పార్టీలో చేరుతార‌నే అంశంపై గ‌త మూడ్నెళ్లుగా తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతూ వ‌చ్చింది. ఒక‌రోజు బీజేపీ (BJP), ఒకరోజు కాంగ్రెస్ (Congress) లో వారు చేరుతున్నార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌గా.. మ‌రికొన్ని రోజులు వారు కొత్త పార్టీ పెడుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఈ గంద‌ర‌గోళానికి తెర‌దించుతూ పొంగులేటి, జూప‌ల్లి ఇద్ద‌రు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఇరువురు నేత‌లు త‌మ అనుచ‌ర‌వ‌ర్గంతో ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేతో పాటు ప్రియాంక గాంధీల‌తో భేటీ అయ్యారు.

అయితే, వీరు జులై 2న కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. ఖ‌మ్మంలో భారీ బ‌హిరంగ స‌భ వేదిక‌గా త‌మ‌ అనుచ‌ర‌గ‌ణంతో వారు కాంగ్రెస్‌లో చేరుతారు. భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ వార్ పాద‌యాత్ర కూడా ఆ స‌మ‌యానికి ఖ‌మ్మంలో ముగియ‌నుంది. దీంతో భ‌ట్టి పాద‌యాత్ర ముగింపు, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిక రెండు కార్య‌క్ర‌మాల‌ను పుర‌స్క‌రించుకొని ఖమ్మంలో జులై 2న భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ గాంధీతో పాటు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేకూడా హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌తో భేటీ అనంతరం పొంగులేటి, జూప‌ల్లి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని గ‌ద్దెదించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. త‌న‌కు ప‌ద‌వులు ముఖ్యం కాదు, ప‌ద‌వులు కావాల‌నుకుంటే ఏ పార్టీలో చేరేవాడినో అంద‌రికీ తెలుసు. నాకు ఆత్మాభిమాన‌మే ముఖ్యం అని పొంగులేటి చెప్పుకొచ్చారు. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత తెలంగాణ‌లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. బీజేపీ ప‌రిస్థితి తెలంగాణలో దిగ‌జారింద‌ని చెప్పారు. ఎన్నిక‌లు వ‌చ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు పెడ‌తాడు. గార‌డి మాట‌లు చెప్ప‌డంలో కేసీఆర్ సిద్ధ‌హ‌స్తులు అని పొంగులేటి విమ‌ర్శించారు.

ఇక నుంచి బీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే క్ర‌మంలో త‌న వంతు పాత్ర పోషిస్తాన‌ని పొంగులేటి చెప్పారు. జూలై 2న ఖ‌మ్మంలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్లు పొంగులేటి స్ప‌ష్టం చేశారు. ఈ స‌భ‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌ను ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ స‌భ‌ను త‌ల‌ద‌న్నేలా ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌తో ఖ‌మ్మం స‌భ జ‌ర‌గ‌బోతుంద‌ని పొంగులేటి చెప్పారు. జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వ‌చ్చే అర్హ‌త‌ను కోల్పోయాడ‌ని అన్నారు. సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని, ఇది అంద‌రి బాధ్య‌త అని జూప‌ల్లి గుర్తు చేశారు.