తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్-1 (Group-1 )నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సోమవారంతో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు తీర్పును రిజర్వ్ చేశారు. అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లలో గ్రూప్-1 మెయిన్స్ పత్రాల మూల్యాంకనంలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థుల అభిప్రాయం ప్రకారం.. ఈ లోపాల వల్ల నిజమైన ప్రతిభావంతులకు న్యాయం జరగలేదని వాదిస్తున్నారు.
Congress Govt : నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి – హరీశ్ రావు
పిటిషనర్లు తమ పిటిషన్లలో ప్రధానంగా రెండు విషయాలను ప్రస్తావించారు. ఒకటి, మెయిన్స్ పత్రాల పునఃమూల్యాంకనం జరగాలని. రెండవది, ఆ అవకాశం లేకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. గతంలో ఈ నియామకాలపై న్యాయమూర్తి రాజేశ్వర్ రావు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా గ్రూప్-1లో ఎంపికైన అభ్యర్థులు కూడా తమవైపు పిటిషన్లు దాఖలు చేస్తూ స్టేను ఎత్తివేయాలని కోర్టును కోరారు.
ఇక మరోవైపు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తమ వాదనలు సమర్పిస్తూ, నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. వాదనలు చివరికి చేరుకున్న నేపథ్యంలో, న్యాయమూర్తి తుది తీర్పును రిజర్వ్ చేశారు. వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తర్వాతే గ్రూప్-1 భవిష్యత్తు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.