BRS VS BRS: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ దౌర్జన్యం (Video)

తెలంగాణాలో మరోసారి వర్గవిభేదాలు బయటపడ్డాయి. ఓ ఫ్లెక్సీ విషయంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల కార్యకర్తల మధ్య వార్ నడిచింది

BRS VS BRS: తెలంగాణాలో మరోసారి వర్గవిభేదాలు బయటపడ్డాయి. ఓ ఫ్లెక్సీ విషయంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల కార్యకర్తల మధ్య వార్ నడిచింది. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, రావుల శ్రీధర్‌రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేసినందుకుగానూ సొంత పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపర్చిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ కు సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్ కార్యకర్త గణేష్ బోనాల పండుగ సందర్భంగా రావుల శ్రీధర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అయితే అది మింగుడుపడని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరియు తన అనుచరులతో కలిసి గణేష్ ఇంటిపై దాడి చేశాడు.

వెంగల్‌రావునగర్‌లో నివాసముంటున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు గణేష్‌సింగ్‌ ఇంట్లో ఉండగా ఎమ్మెల్యే తన అనుచరులతో శ్రీధర్‌రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై అసభ్య పదజాలంతో దూషించారు. ఆ కార్యకర్త ఎమ్మెల్యే మాగంటికి వివరించడానికి ప్రయత్నించినప్పుడు అతను మరింత దుర్భాషలాడాడు. ఈ క్రమంలో మాగంటి అనుచరులు గణేష్, తన తండ్రిపై దాడి చేశారు. అయితే గతంలో కూడా ఎమ్మెల్యే అనుచరులు శ్రీధర్ రెడ్డి ఫ్లెక్సీని తొలగించారని గణేష్ తెలిపారు. ఈ ఘటన మొత్తం గణేష్ ఇంటి దగ్గర అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసు సిబ్బంది సమక్షంలోనే గణేష్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడంతో పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే గణేష్ నుంచి గానీ, అతని కుటుంబ సభ్యుల నుంచి గానీ పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.