Jubilee Hills Co-operative: రక్షకులెవరు.. భక్షకులెవరు..?

జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్ సొసైటీ అంటేనే దానికో సెలబ్రిటీ స్థాయి గుర్తింపు. దీనికి వేల కోట్ల ఆస్తులున్నాయ్‌. రాజకీయ ప్రముఖులు మొదలు ఎందరో వీవీఐపీలు, పారిశ్రామికవేత్తలు, సినీప్రముఖులు ఇలా ఎందరెందరో సభ్యులుగా ఉన్నారు.

  • Written By:
  • Updated On - February 25, 2022 / 12:12 PM IST

జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్ సొసైటీ అంటేనే దానికో సెలబ్రిటీ స్థాయి గుర్తింపు. దీనికి వేల కోట్ల ఆస్తులున్నాయ్‌. రాజకీయ ప్రముఖులు మొదలు ఎందరో వీవీఐపీలు, పారిశ్రామికవేత్తలు, సినీప్రముఖులు ఇలా ఎందరెందరో సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి సొసైటీలో 15 ఏళ్లపాటు సాగిన అరాచకాల్ని వెలుగులోకి తెచ్చి, మార్పు కోసం అలుపెరగని పోరాటం చేసి, ఘన విజయం సాధించి, దాదాపు ఏడాది కిందట బాధ్యతలు చేపట్టి సమూల ప్రక్షాళణ మొదలు పెట్టింది ప్రస్తుత పాలక మండలి. అప్పటివరకూ అప్పనంగా సొసైటీ ఆస్తుల్ని పీల్చి పిప్పి చేసిన అనకొండల్లాంటి కొందరు పెద్దలు ఈ దెబ్బతో విలవిల్లాడారు. ఓటమి పాలైన రోజు నుంచి సొసైటీ రక్షణ కోసం ప్రస్తుత పాలకమండలి ఏ నిర్ణయం తీసుకుంటున్నా అడ్డగోలుగా అడ్డుకోవాలని చూడడం.. చివరికి అభాసుపాలవడం ఇదే తంతు. పాతవాళ్లు చేసిన అక్రమాల చిట్టా డైలీ సీరియల్‌గా ఎంత చెప్పినా తరగదు. బినామీల పేరుతో వందల కోట్ల విలువైన ప్లాట్లు కొట్టేశారు.. కొంత మందికి అతి తక్కువ ధరకు భూములు కట్టబెట్టారు.. రికార్డుల ట్యాంపరింగ్‌ల్లాంటివీ జరిగాయనడానికి ఆధారాలున్నాయ్‌. ఇలాంటివెన్నో బయటకు రాకుండా చూడ్డానికి కుట్రలు చేస్తూ గత పాలకమండలి 2 అంశాలపై ఇప్పుడు దుష్ర్పచారం చేస్తోంది.. వాటిల్లో నిజమెంత, కడుపుమంటతో వండి వడ్డించిన అబద్ధమెంత ఓసారి చూస్తే అన్నీ అర్థమవుతున్నాయి. ఈ విషయంలో జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్ సొసైటీ సభ్యులతోపాటు ప్రజలకూ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది.

1. నిర్మాణం పేరుతో రూ.28 కోట్లు అడ్డంగా నొక్కేసిందెవరు..?

ఇదీ నిజం :- జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్ సొసైటీ గత పాలక మండలి సొసైటీకి చెందిన 4 ఎకరాల్లో ఓ భవనాన్ని కట్టించింది. ఇందుకోసం 60 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించింది. ఆ తర్వాత దాన్ని ఓ కార్పొరేట్‌ సంస్థ ఆఫీస్‌ కోసం లీజ్‌కు ఇచ్చేసింది. అదీ ఒకటి రెండు ఏళ్లు కాదు ఏకంగా 33 సంవత్సరాలు లీజుకిచ్చారు. దీని ద్వారా నెలకు వస్తున్న అద్దె 25 లక్షలు. ఈ బిల్డింగ్‌ కట్టడానికి తీసుకున్న లోన్‌కి నెలకు కట్టాల్సిన ఈఎంఐ 42 లక్షలు. అంటే సొసైటీ ఖాతా నుంచి ఇంకా వాయిదా కోసం 17 లక్షలు కట్టాల్సి వస్తోంది. సుమారు ఏడాది కిందట కొత్త పాలక మండలి బాధ్యతలు తీసుకున్నాక రికార్డులన్నీ పరిశీలిస్తుంటే ఈ విషయం బయటకు వచ్చింది. అసలు ఈ భవనం కట్టడానికి ఇంత ఖర్చు కానే కాదు అనే సందేహాలు అప్పటికే పలువురు సొసైటీ మెంబర్ల నుంచి రావడంతో నిజానిజాలు తేల్చాలని డిసైడ్‌ అయ్యింది. తర్వాత గవర్నమెంట్ అప్రూవ్డ్‌ వాల్యూయర్‌ ద్వారా విలువను అంచనా వేయించారు. ఇదంతా పూర్తిగా శాస్త్రీయంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన అప్రూవ్డ్‌ వ్యాల్యూడ్‌ ఛార్టెడ్‌ ఇంజినీర్ ద్వారానే జరిగింది. వాళ్లు ఈ 4 ఎకరాల స్థలంలో కట్టిన భవనం ఖరీదు 32 కోట్ల రూపాయలుగా నిర్థారించారు. కానీ గత పాలక మండలి దీనికి చూపించిన ఖర్చు 60 కోట్లు. అంటే లెక్కల్లో 28 కోట్లు తేడా వస్తోంది. మరి ఈ డబ్బంతా ఎవరు పందికొక్కులా మెక్కినట్టు..? ఇక్కడ జీహెచ్‌ఎంసీని సైతం గత పాలకమండలి మోసం చేసింది. ఈ స్థలంలో కమ్యూనిటీ సెంటర్ కడుతున్నట్టు, అదే పేరుతో పర్మిషన్‌ తీసుకున్నారు. తీరా భవనం కట్టేసి కార్పొరేట్ సంస్థకి లీజుకు ఇచ్చారు. ఇదంతా కూడా ముందు నుంచీ కుట్రపూరితంగానే జరిగినట్టు అర్థమవుతోంది. దీన్నే ప్రస్తుత పాలక మండలి ప్రశ్నిస్తోంది. అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చాక ఈ లీజు ఒప్పందాన్ని రద్దు చేసింది. సొసైటీ నిబంధనల ప్రకారం ఈ భవనాన్ని మెంబర్స్‌ కమ్యూనిటీ సెంటర్‌గానే ఉంచాలని, సభ్యుల అవసరాల కోసం వాడుకోవాలని జనరల్‌ బాడీ మీటింగ్‌లో తీర్మానించారు. బిల్డింగ్ కట్టడానికి అయినట్టు చూపించిన 60 కోట్లలో 28 కోట్లు ఎక్సెస్ అని గుర్తించాక ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది ప్రస్తుత పాలకమండలి. సొసైటీస్‌ రిజిస్ట్రార్‌కి ఫిర్యాదు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరింది. ఈ విషయంపై పాలకమండలి చేసిన తీర్మానాన్ని, ఇతర వివరాల్ని జతచేస్తూ లేఖ పంపింది. త్వరలోనే దీనిపై విచారణ మొదలైతే దొంగల బాగోతం మొత్తం బయటకు వస్తుంది. ఈ వాస్తవం ఇలా ఉంటే తాము చేసిన అక్రమాల్ని కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు తిరిగి బురద చల్లుతున్నారే తప్ప.. అసలు విషయంపై చర్చ జరగనివ్వడం లేదు. చేసిన తప్పులు బయటకు వస్తాయని ఇప్పుడు ఇంతలా భయపడేవాళ్లు ఎందుకంత ద్రోహానికి పాల్పడ్డారు..? ప్రజాధనాన్ని అడ్డగోలుగా మింగేసినవాళ్ల అవినీతి బయటపెట్టడం తప్పా..? కోట్ల రూపాయల ఆస్తుల్ని సొంతానికి వాడుకునే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు..? పెత్తనమిచ్చింది పెద్దమనిషిలా ఉంటారని.. పందికొక్కుల్లా మెక్కేస్తారని కాదు కదా..?

ఈ నొక్కుడు వ్యవహారంలో నిజాలు ఇలా ఉంటే.. ప్రస్తుతం చెప్పుకుంటున్న 60 కోట్ల భవనాన్ని ‘మెంబర్స్‌ కమ్యూనిటీ సెంటర్‌’గా ఉంచాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సొసైటీ నిబంధనల్ని ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏదైనా సొసైటీ లేదా లేఅవుట్‌కి అనుమతులు ఇచ్చేప్పుడు ఓ నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారమే అందులో పార్కులకు, కమ్యూనిటీ సెంటర్లకు, హెల్త్ సెంటర్లకు, రోడ్లకు ఇలా వివిధ అవసరాలకు ఇంతింత స్థలం కేటాయించాల్సి ఉంటుంది. వాటి ప్రకారమే అభివృద్ధి పనులు జరగాల్సి ఉంటుంది. గతంలో అలా జరగలేదు కాబట్టే ఈ 4 ఎకరాల్లో కట్టిన భవనాన్ని ‘మెంబర్స్‌ కమ్యూనిటీ సెంటర్‌’గానే ఉంచాలని ప్రస్తుత పాలకమండలి నిర్ణయించుకుంది.

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ను ఆనుకుని ఉన్న 6,072 గజాల స్థలం విషయంలో ఏం జరుగుతోంది..? అక్రమాల్ని బయటకు తీస్తుంటే అడ్డుకుంటున్నది ఎవరు..?

ఇదీ నిజం :- దొంగే తిరిగి దొంగా దొంగా అని అరవడం ఎలా ఉంటుందో, ఆస్తిని కాపాడమని చేతిలో పెడితే దాన్ని కేక్‌ని కోసినట్టు ఖండఖండాలుగా నరికి, నంజుకుని తినేసినోళ్లే నీతులు చెప్తే ఎలా ఉంటుందో .. ఈ స్థలం విషయంలో గత పాలక మండలి నీతి కథలు చెప్పడం అలాగే ఉంటుంది. కుట్రలు ఈ స్థాయిలో చెయ్యొచ్చా అని నివ్వెరపోయేంత దారుణంగా ఈ స్థలం విషయంలో ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు బయటకు వస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర రోడ్‌నంబర్‌-1లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ను ఆనుకుని సొసైటీకి 6,072 గజాల స్థలం ఉంది. ఇంతకు ముందు సొసైటీ నిబంధనల గురించి చెప్పుకున్నట్టు లేఅవుట్‌లోని ఈ స్థలం ఆరోగ్య సేవలకు వాడుకోవాలి. అందుకే అందులో కొంత భాగం చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కి ఇచ్చారు. మిగతాది ఖాళీగా ఉంది. ఈ స్థలం విషయంలో 2020లో ఏకపక్షంగా మంతెన కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌తో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు.. నిజానికి ఇలా డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకునే హక్కు సొసైటీకి లేదు. కానీ నిబంధనల్ని ఉల్లంఘించి ముందుకు వెళ్లారు. అటు మంతెన సంస్థ ఓనర్‌ను 3 వేల కోట్ల స్కామ్‌లో ఈడీ అరెస్టు చేసింది అది వేరే కథ. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందల్లా ఆ సంస్థతో సొసైటీ చేసుకున్న ఒప్పందం గురించే. 40 శాతం సొసైటీకి, 60 శాతం వాటా మంతెన కన్‌స్ట్రక్షన్‌కు ఉండేలా ఆ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కుదిరింది. ఇదంతా ఒక ఎత్తయితే ఆ మంతెన సంస్థతో, సొసైటీ గత పాలకమండలిలో సెక్రెటరీగా పనిచేసిన హనుమంతరావు జీపీఏ చేసుకోవడం ఇంకో ఎత్తు. ఇదేదో సొంత కంపెనీ భూమి అన్నట్టు, అత్తగారి ఆస్తి అన్నట్టుగా అడ్డగోలుగా అగ్రిమెంట్లు, జీపీఏలు చేసేసుకున్నారు. ఇదెలా చెల్లుతుంది అని ప్రశ్నించిన వాళ్లకు సమాధానం చెప్పలేక ఎదురు దాడికి దిగుతున్నారు. ఎందుకంటే.. ఈ ఒప్పందంలో క్విడ్‌ ప్రో కో స్పష్టంగా కనిపిస్తోంది. సొసైటీకి చెందిన స్థలానికి డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్ చేసుకున్న సంస్థతో.. అదే సొసైటీ మాజీ సెక్రెటరీ జీపీఏ చేసుకోవడం అంటేనే అంతర్గతంగా ఏం జరిగిందో ఇట్టే అర్థం అవుతోంది. నీకిది-నాకది పేరుతో జరిగిన వ్యవహారంలో వాస్తవాలు బయటకు వస్తుండడంతో ప్రస్తుత పాలకమండలి దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేసి, విచారణ చేయించాలని కోరేందుకు సమాయత్తం అవుతోంది. తద్వారా ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి, ఏం జరిగింది అనేది మొత్తం బయటకు లాగబోతున్నారు. ఇక, ఈ జీపీఏ రద్దు చేయడం ద్వారా ఈ స్థలాన్ని జూబ్లీహిల్స్‌ క్లినికల్‌ సెంటర్‌గా ఉపయోగించాలని ప్రస్తుత పాలక మండలి భావించింది. ఆ దిశగానే నిర్ణయం తీసుకుని ఆరోగ్యసేవల కేంద్రంగా ఉపయోగించేందుకు కట్టుబడి ముందుకు వెళ్తోంది. త్వరలోనే అన్ని అడ్డంకులను దాటి ఈ హెల్త్‌ సెంటర్ విషయంలో విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. ఇది అర్థమవుతోంది కాబట్టే.. తిన్నదంతా ఎక్కడ కక్కిస్తారో అనే భయంతో అక్రమార్కులు ఇప్పుడు గాయిగాయి చేస్తున్నారు. జరిగిన తప్పులను సరిచేసే ప్రయత్నాల్లో ప్రస్తుత పాలకమండలి ఉంటే.. ఆ పని జరక్కుండా అడ్డుకోవడంతోపాటు తప్పుడు కథలు అల్లుతూ అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు హనుమంతరావు అండ్‌ గ్యాంగ్‌. అడ్డగోలుగా కోట్లకు కోట్లు మింగేయాలని చూసిన బకాసురులూ వీళ్లే. కుట్రలపై కుట్రలతో అసత్యాల్ని ప్రచారం చేయడంలో శకునిని మించిపోయినోళ్లూ వీళ్లే. జూబ్లీహిల్స్ సొసైటీ పాలిట పాపాలభైరవులుగా మారిన ఇలాంటి వాళ్ల అరాచకాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటీ తవ్వి బయటకు తీస్తుంటే కింద నుంచి వణుకొచ్చేస్తోంది. ఏదేమైనా ప్రస్తుత పాలకమండలి ప్రయత్నాలతో త్వరలోనే వందల కోట్లు మింగిన ఘనులపై నేరాలు నిరూపణ కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని కౌంటర్‌ చేసేందుకు తమ అనుకూల మీడియా ద్వారా ఇష్టానుసారం వాళ్లు వార్తలు రాయించుకుంటున్నా ఆ గాలి రాతలు ఎక్కడా నిలబడడం లేదు.