JubileeHills: జూబ్లీ హిల్స్ (JubileeHills) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం (అక్టోబర్ 13) విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
పూర్తి ఎన్నికల షెడ్యూల్
- నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 13 (రేపటి నుండి)
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 21
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 22
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 24
- పోలింగ్ తేదీ: నవంబర్ 11
- కౌంటింగ్ తేదీ: నవంబర్ 14
Also Read: Data Center : నేడు విశాఖలో డేటా సెంటర్ కు లోకేశ్ శంకుస్థాపన
అధికారుల సన్నద్ధత
జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఉప ఎన్నికల నిర్వహణ కోసం షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన ప్రకటించారు. రిటర్నింగ్ అధికారి (RO), సహాయ రిటర్నింగ్ అధికారులతో (ARO) సమావేశమైన కర్ణన్ నామినేషన్ల ప్రక్రియ సజావుగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా ఎన్నికల సంఘం (ECI) నిబంధనలకు కట్టుబడి అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి పి. సాయిరాంకు ఆయన ప్రత్యేకంగా సూచించారు. ఉప ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలు, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు వంటి అంశాలపైనా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌తో నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకోనుంది. నామినేషన్ల పర్వం, ప్రచారం, పోలింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
