Site icon HashtagU Telugu

BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అక్రమాలపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు!

BRS

BRS

BRS: మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ (BRS) పార్టీ ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని (CEO) కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న అక్రమాలపై సమగ్ర ఫిర్యాదు సమర్పించింది.

ప్రధాన ఆరోపణలు, డిమాండ్లు

మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తున్నట్లు ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు తెలిపారు.

కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ కోరింది. సీ విజిల్ (c-VIGIL) యాప్‌లో కూడా ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా నకిలీ ఓటర్ ఐడీ కార్డులు (Fake Voter IDs) తయారు చేశారని, వాటికి సంబంధించిన వీడియో ఆధారాలను కూడా ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించినట్లు తెలిపారు.

Also Read: Messi: డిసెంబ‌ర్‌లో హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ!

యూసుఫ్‌గూడలో కాంగ్రెస్ కార్యాలయమును ఆనుకొని పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని, దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కమిషన్‌కు అందజేశామని హరీష్ రావు పేర్కొన్నారు. సెన్సిటివ్ పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాలను నియమించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. సెన్సిటివ్ బూత్‌ల వివరాలను కమిషన్‌కు సమర్పించారు. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులు, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లను నియమించి, పోలింగ్ బూత్‌లోకి వెళ్లే ప్రతి ఓటర్ ఐడెంటిటీని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతించాలని కోరినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రిపై విమర్శలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారంటీలపై సమీక్ష పెట్టడానికి సమయం దొరకలేదని, ఎన్నికల సమయంలో ఇప్పుడు రివ్యూ పెట్టడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడానికేనని ఆరోపించారు. “మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి మోకాళ్లపై తిరుగుతున్నాడు” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Exit mobile version